సాధారణంగా చట్టసభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే మాటల యుద్ధంలో కొన్ని అభ్యంతరకర పదాలు దొర్లుతుంటాయి. అయితే కొన్ని పదాలు పార్లమెంట్లో వినియోగించేందుకు నిషేధం ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరికొన్ని చేరాయి. సోమవారం(జులై 18) నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ జాబితాను లోక్సభ సెక్రటేరియట్ విడుదల చేసింది. నిషేధిత పదాలతో కూడిన ఓ కొత్త బుక్లెట్లో.. ‘ అరాచకవాది, శకుని, నియంతృత్వం, తాన్షా, తానాషాహి, జైచంద్, వినాష్ పురుష్, ఖలిస్తానీ, ద్రోహ చరిత్ర, నికమ్మ, నౌటంకి, బ్రెహీ సర్కార్’ వంటి పదాలను చట్ట సభ్యులు వినియోగించకూడని జాబితాలో చేరాయి. ‘చంచా, చంచాగిరి, మొసలి కన్నీళ్లు, లైంగిక వేధింపులు, అహంకారి, చీకటి రోజులు, గాడిద, తానాషా, పిరికివాడు, క్రిమినల్, అసమర్థుడు, శకుని, గూండాలు, దాదాగిరి, విశ్వాసఘాతకుడు’ వంటి పదాలను కూడా వినియోగించకూడదు.
ఇక ఈ జాబితాపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మండిపడ్డారు. తాను వాటిని ఉపయోగిస్తానని, అవసరమైతే సస్పెండ్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై తీవ్రంగా మండిపడింది. మోదీ సర్కారు నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే అన్ని పదాలను ‘అమర్యాదకరమైనవి’గా పేర్కొన్నారంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మండిపడ్డారు. శివసేన నేత ప్రియాంక చతుర్వేదీ స్పందిస్తూ.. ‘మేం ఏ మాట్లాడాలన్నదీ మీరు నిర్ణయిస్తున్నారు. వాహ్వా మోడీ జీ’ అంటూ కామెంట్ చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రాల చట్టసభల్లో కొన్ని పదాలను, హావభావాలను అమర్యాదకరమైనవిగా ప్రకటిస్తుంటారు. రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.