ఏసీబీ అక్వేరియంలోనే అవినీతి చేప - MicTv.in - Telugu News
mictv telugu

ఏసీబీ అక్వేరియంలోనే అవినీతి చేప

December 5, 2017

తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం.. కంచే చేను మేయడం.. వంటి సామెతలన్నీ శోభన్ బాబుకు పక్కాగా వర్తిస్తాయి. ఏపీ  అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) సీక్రెట్ బ్రాంచిలో పనిచేస్తున్న ఇతడు ప్రజల సొమ్ములు వసూలు చేసి తనకిస్తున్న జీతంతో తృప్తిపడక అవినీతిపరులు తినిపారేసిన పళ్లాలను కూడా కతికాడు.

అవినీతి అధికారులపై ఏసీబీ దాడి చేసే ముందు ఆ సమాచారాన్ని వారికి ఫోన్లలో చప్పున చేరవేశాడు. ఇలా 50 మంది అక్రమార్కులకు కొమ్ముకాశాడు. ఏసీబీకి అనుమనమొచ్చి దర్యాప్తు చేయగా శోభన్ గుట్టు రట్టయింది. దీంతో అతనిపై  సస్పెన్షన్‌ వేటు పడింది.  

ఇతడు అవినీతి అధికారులతో ముందుగానే  కుమ్మక్కయి.. ఏసీబీ దాడుల సమాచారాన్ని వారికి లీక్ చేసేవాడని, అందుకే సస్పెండ్ చేశామని ఏసీబీ తెలిపింది. ఇతడు 50మందికిపైగా అవినీతిపరులతో మాట్లాడిన కాల్ డేటాను అధికారులు విశ్లేషించారు. వారిపై మళ్లీ దాడులు చేస్తామన్నారు. అంతా లీక్ అయ్యాక ఇక దాడులు చేస్తే ఏం దొరుకుతుందో శోభన్ బాబుకే తెలియాలి!