చిత్తూరు సంత పేటలోని అమ్మఒడి సేవా సంస్థ నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. అనాథ పిల్లల్ని చూపించి దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి సొంతంగా వాడుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. సంస్థ అవినీతిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీతో విచారణకు ఆదేశించారు. అమ్మ ఒడి నిర్వాహణా తీరుపై కలెక్టర్ మండిపడుతూ.. RDO, DSP, ICDS PDలను విచారణ అధికారులుగా నియామించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారుల కమిటీ క్షుణ్ణంగా ఆశ్రమాన్ని తనిఖీలు చేసింది. ఆశ్రమంలో పిల్లలను ఉంచడానికి నిర్వాహకుడికి ఎలాంటి అనుమతి లేదని కమిటీ గుర్తించింది.
శిధిలావస్థలో ఉన్న భవనంలో పిల్లల్ని, వృద్ధులను ఎలా ఉంచుతారని అధికారులు ప్రశ్నించారు. భవనంలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసు యంత్రాంగాన్ని కూడా కలెక్టర్ రంగంలోకి దింపనున్నారు.