370 రద్దుతో కశ్మీర్‌లో తగ్గిపోయిన అవినీతి - MicTv.in - Telugu News
mictv telugu

370 రద్దుతో కశ్మీర్‌లో తగ్గిపోయిన అవినీతి

October 24, 2020

Corruption in Kashmir reduced with article 370 cancellation.. G Kishan Reddy.jp

జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడు అవినీతి తగ్గిందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అది కేవలం జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతోనే సాధ్యపడిందని అభిప్రాయపడ్డారు. అయితే ఓ జమ్ముకశ్మీర్‌ నేత చైనా సహకారంతో మళ్లీ ఆర్టికల్‌ 370ని తీసుకొస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. మరొకరు తాము జాతీయ జెండాను పట్టుకోబోమని అంటున్నారని మండిపడ్డారు. అధికారం లేకపోవడంతోనే వారిలా నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉండి కూడా అభివృద్ధి మాత్రం ఏం చేయలేకపోయారని.. వచ్చిన నిధులను అప్పనంగా దోచుకున్నారని పీడీపీ తదితర పార్టీలను ఉద్దేశించి మట్లాడారు. కొన్నేళ్లుగా ఐటీబీపీ అత్యాధునిక ఆయుధాలు, అధునాతన సామగ్రి కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. సరిహద్దు పహార, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించేందుకు వీలుగా ఇటీవల 28 అధునాతన వాహనాలను ఐటీబీపీ కొనుగోలు చేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. 

కాగా, ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆగస్టు 5, 2019 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకాశ్మీర్‌ను శాసనసభ కలిగి ఉండేలా ఢిల్లీ మాదిరి కేంద్రపాలిత ప్రాంతంగానూ, లడాఖ్‌ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతంగానూ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయలో కమ్యూనికేషన్ మార్గాలను కత్తిరించింది. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా పలువురు ప్రముఖ కాశ్మీరీ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మెహబూబా ఆరోజును భారతదేశ ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి రోజు అని పేర్కొన్నారు. హింసను నివారించడానికే ఈ ఆంక్షలను విధించామని ప్రభుత్వ అధికారులు స్పష్టంచేశారు. రిజర్వేషన్లు, విద్యాహక్కు, సమాచార హక్కు వంటి ప్రభుత్వ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు అందేలా వీలు కల్పించడం కోసమే ఈ రద్దు అని అధికారులు పేర్కొన్నారు.