లంచాల లావణ్య అరెస్ట్.. అప్పట్లో ఉత్తమ ఎమ్మార్వో అంట! - MicTv.in - Telugu News
mictv telugu

లంచాల లావణ్య అరెస్ట్.. అప్పట్లో ఉత్తమ ఎమ్మార్వో అంట!

July 11, 2019

mro lavanya.

లంచాలు గించాలు తీసుకోకుండా చక్కగా పనిచేస్తుందని ఆమెకు రెండేళ్ల కిందట ఉత్తమ ఎమ్మార్వో అవార్డు ఇచ్చారు. కానీ ‘ఉత్తమ’ పొరల కింద దాగిన లంచావతారాన్ని గుర్తించలేదు. ఓ రైతుతో డీల్ విషయంలో అమ్మగారి బండారం బయటి పడింది. లంచం కేసులో రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్యను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు.  పరారీలో ఉన్న ఆమె భర్త, మునిసిపల్ శాఖ ఉద్యోగి వెంకటేశ్ నాయక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

బుధవారం రాత్రి వరకు లావణ్య నివాసాల్లో చేసిన తనిఖీలో భారీ అక్రమాస్తులు వెలుగు చూశాయి. హయత్‌నగర్‌లోని ఆమె కొంపలో రూ.93 లక్షల నగదు, 40 తులాలకు పైగా బంగారం, కొన్ని స్థలాలు, ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. కొందుర్గు వీఆర్వో అనంతయ్య బుధవారం మామాడిపల్లి భాస్కర్ అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడంతో లావణ్య గుట్ట రట్టయింది. తన 9.07 ఎకరాల పొలానికి కేటాయించిన నంబర్ సర్వేల్లో లేదని, దాన్ని సవరించాలని భాస్కర్ కోరాడు. రూ.8 లక్షల లంచం ఇస్తే పని చేస్తానని అనంతయ్య బేరం పెట్టాడు. తనకు రూ.5లక్షలు, లావణ్యకు రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఆమె చెప్పడంతోనే అనంతయ్య లంచం తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్పారు. ఆమె వద్ద భారీగా ఆస్తులు ఉన్నట్టు తేలడంతో లావణ్యను అరెస్టు చేసి విచారణ కోసం నాంపల్లిలోని ఏసీబీ ఆఫీసుకు తరలించారు. పట్టుబడిన సొత్తు లావణ్య, ఆమె భర్త ఇద్దరూ కలిసి అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. 

rr