కరోనాను అంటిస్తే ఉగ్రవాద చట్టం కింద శిక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాను అంటిస్తే ఉగ్రవాద చట్టం కింద శిక్షలు

March 26, 2020

Counting terrorist under corona 

 కరోనా అంటే కిలోమీటర్ దూరం పరుగెత్తే కాలం వచ్చింది. మనిషి దగ్గినా, తుమ్మినా కింది నుంచి మీది వరకు అనుమానంగా చూస్తున్నారు. ఈ వైరస్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇతరులకి అంటిస్తే వారి మీద ఉగ్రవాద చట్టం కింద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. కరోనా ఉన్నవారిని శతృవుగా చూస్తుంటే.. దానిని వేరేవారికి అంటించినవారిని ఉగ్రవాది కింద లెక్కగడుతోంది న్యాయశాఖ.  ‘కావాలని కోవిడ్-19ను పొరుగువారికి అంటిస్తే వారిపై టెర్రరిస్ట్ నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకోండి’ అని న్యాయశాఖ ఉన్నతాధికారులు పోలీసు శాఖ, అమెరికా అటార్నీలకు డిప్యూటీ అటార్నీ జనరల్ జఫ్రీ రోజెన్ ఆదేశించారు. 

 ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూటర్లు, విచారణ అధికారులకు మెమో ద్వారా ఆదేశించారు. ‘కోవిడ్-19 ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఇది ఒక రకంగా తీవ్రవాదాన్ని పోలి ఉంటుంది. కరోనాను అంటిస్తామని బెదిరించినా, అంటించాలని చూసినా, అమెరికా మీద కుట్రపూరితంగా దాన్నో ఆయుధంగా ప్రయోగించాలని చూసినా.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని మెమోలో స్పష్టంచేశారు. అయితే, ఇప్పటివరకు అక్కడ అలాంటి ఉద్దేశపూర్వకంగా కరోనా అంటించిన కేసులు ఏమైనా నమోదు అయ్యాయా? లేదా? అనేది మాత్రం తెలియలేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ మహమ్మారి ప్రభావాన్ని అరికట్టేందుకు, అత్యవసర సరుకులు సరఫరా చేసేందుకు, ధరలను నియంత్రించేందుకు న్యాయశాఖ ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మాస్క్‌లను ఎవరైనా బ్లాక్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.