అసలైన ప్రేమికుల మధ్య అనుబంధం గాఢంగానే ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు క్షణం కూడా ఉండలేరు. విడిచి పెట్టాల్సి వస్తే ప్రాణం పోయినంత పనవుతుంది. ఒంటరిగా తినడానికి, టాయిలెట్కో వెళ్లినప్పుడు లవర్‌పై ఆలోచనలో వేగిపోతుంటారు. అతడు నిత్యం ఆమె తలపుల్లో, ఆమె నిత్యం అతని తలపుల్లో గడిపేస్తుంటారు. ఈ ఎడబాటు ఎందుకని ఓ జంట చిత్రమైన పని చేసి వార్తలకెక్కింది.
ఒక్క క్షణం కూడా విడిపోవద్దని సదరు ప్రేమ జంట చేతులను గొలుసుతో కట్టేసుకుంది. తినడం, తిరగడం, నిద్రపోవడమే కాదు, చివరికి టాయిలెట్‌కు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. రోజుకు 24 గంటలూ.. అక్షరాలా ఒక్క క్షణం కూడా విడిపోని జంటగా హల్చల్ చేస్తున్నారు.
ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్, విక్టోరియా అనే యువతీ యువకుల గొలుసు గొడవ ఇది. దీని వెనక పెద్ద కథే ఉంది. ఎంత ఘాటు ప్రేమ అయినా ఇలా చైన్‌తో కట్టేసుకోవడం నేరం అవుతుందని ముందు జాగ్రత్తగా అధికారులను సంప్రదించారు. వీరికి పిచ్చి ఇంకా ముదరలేదని నిర్ధారించిన అధికారులు చైన్ అటాచ్మెంటుకు అంగీకరించారు. గతవారం ఇద్దరి మణికట్లకు బేడీలు వేసి వెల్డింగ్ చేశారు. గొలుసుతో బందీలయ్యాక ఇద్దరూ కారులో 325 మైళ్లు ప్రయాణించారు. విషయం తెలియని వాళ్లు ఈ జంటను వింతగా చూస్తున్నారు. మరి జీవితమంతా ఇలాగే ఉంటారా అని ఎవరైనా ప్రశ్నిస్తే మరింత వింతైన సమాధానం చెబుతున్నారు.
‘ప్రస్తుతానికి 3 నెలల వరకు ఇలా ఉంటాం. ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరడానికి ఈ పరీక్ష పెట్టుకున్నాం. మూడు నెలల తర్వాత ఏమవుతుందో చూడాలి ’ అని నవ్వుతూ చెబుతున్నారు. కొసమెరుపు ఏమంటే.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేక అలా కట్టేసుకున్నారని కామెంట్లు రావడం!