Couple dies in road accident in karnataka
mictv telugu

కోటి రూపాయలు వచ్చినా విధి ఊరుకోలేదు.. ప్రాణాలు తీసింది

October 4, 2022

తమిళనాడుకు చెందిన ఓ చిన్న పిల్లాడు ప్రాణాంతక వ్యాధికి గురయ్యాడు. దాతలు స్పందించి చికిత్స కోసం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. కానీ, విధి మరోలా తలచింది. చికిత్సకు బయల్దేరిన వారిని చిదిమేసింది. అనూహ్య ప్రమాదం ఆ కుటుంబాన్ని కబళించింది. వివరాల్లోకెళితే.. రాణిపేట జిల్లాకు చెందిన దంపతులు బాలమురుగన్, సెల్విలకు ఇద్దరు కుమారులు. చిన్నా చితకా కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. అయితే చిన్న కుమారుడికి అరుదైన ప్రాణాంతక వ్యాధి సోకడంతో బెంగళూరుకు చెందిన ఓ సంస్థ చికిత్స కోసం కోటి రూపాయలు ప్రకటించింది. ఆ డబ్బుతో చికిత్స తీసుకోవడానికి ఆ కుటుంబం సిద్ధమైంది. స్వగ్రామానికి వెళ్లి దారి ఖర్చుల కోసం కొంత డబ్బు సమకూర్చుకుని బెంగళూరుకు పయనమయ్యారు. ఆదివారం రాత్రి 9.30 గంటలకు హొసకొటే మైలాపూర్ గేటు వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బాలమురుగన్, సెల్వి దంపతులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు చిన్న కుమారుడు వీరి రాకకోసం ఆస్పత్రిలో వేచి చూస్తుండగా, ఈ దుర్ఘటన జరగడంతో విషాదం నెలకొంది. దీంతో దాతలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా విధి వంచించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.