COUPLE FIGHT FOR MUTTON IN MADHYA PRADESH
mictv telugu

భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో దూరిన వ్యక్తి దారుణ హత్య

October 20, 2022

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణంగా జరుగుతుంటాయి. అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు కొట్లాడుకుని తర్వాత సర్దుకుపోతుంటారు. మరీ తీవ్రమైతే ఇరుగు పొరుగు వారు కలగజేసుకొని ఇద్దరినీ శాంతించే ప్రయత్నం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇలానే జరుగుతుంది. కానీ, మధ్యప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. సర్దిచెప్పడానికి మధ్యలో దూరిన వ్యక్తి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. రాజధాని నగరం భోపాల్‌లో జరిగింది ఈ ఘటన. అయితే అసలు దంపతుల మధ్య గొడవ మటన్ కూరతో ప్రారంభమైంది.

పప్పు అనే వ్యక్తి మంగళవారం రోజు మటన్ వండాలని ఇంట్లో భార్యకు చెప్పాడు. అయితే మంగళవారం మటన్ తినకూడదని భార్య వారించడంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్టయింది. గొడవ పడుతున్న భార్యాభర్తలకు సర్ధిచెప్పడానికి పక్కింట్లో ఉండే బిల్లు అనే వ్యక్తి ప్రయత్నించి ఇద్దరినీ శాంతపరిచాడు. తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే మా మధ్యకే వస్తావా అని కక్ష పెంచుకున్న పప్పు.. బిల్లు ఇంటికి వెళ్ళి అతడిని దారుణంగా కొట్టాడు. దీంతో బిల్లు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేయగా, పప్పు భార్య ఇచ్చిన వాంగ్మూలం మేరకు పప్పును అరెస్ట్ చేశారు.