కోట్లు సంపాదించినా కొందరికి తృప్తి ఉండదు. ఇంకా సంపాదించాలె, ఉన్న కోట్లను డబుల్ త్రిబుల్ జెయ్యాలే అని జీవితంలో బిజి బిజి అయ్యి బ్యాంకుల్లో, ఇండ్లలో కట్టలు , కట్టలు కూడబెడుతుంటారు. అయినా వాళ్ల జీవితాల్లో ఏదో తెలియని అసంతృప్తి. కానీ కోట్ల ఆస్తిని వదిలేసినా ఏ సమస్యా లేకుండా బతకొచ్చు అని నమ్మేవారు మరికొందరు. మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు రెండో కోవకే చెందుతారు. ఆస్తులు, బంధాలు అన్నింటిని వదులుకొని సన్యాసం పుచ్చుకోవడానికి వారు సిద్ధమయ్యారు.
నీమచ్ కు చెందిన సుమీత్ రాథోడ్(35), అనామిక(34) దంపతులకు రూ.100 కోట్లకు పైగా ఆస్తి, మూడేళ్ల పాపఉంది. అయితే వీరు వందకోట్ల ఆస్తితో పాటు తమ మూడేళ్ల చిన్నారిని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. కారణం వాళ్లు సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకోవడమే. అయితే మీరు సన్యాసం తీసుకుంటే ఆ మూడేళ్ల చిన్నారి పరిస్ధితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించమని బంధువులు, స్నేహితులు, స్థానికులు ఎంత చెప్పినా లాభం లేకపోయింది. ఆస్తిని, పాపను వద్దనుకుని.. వీళ్లు తీసుకున్న నిర్ణయానికి అందరు నోరెళ్ల బెట్టారు. అయితే భర్త ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నానని చెప్పగానే భార్య అనామిక కూడా కూతురిని వదులుకొని…నేను నీ వెంట ఉంటానని భర్త దారినే ఎంచుకుంది. కూతురిని తెలిసిన బంధువులకు దత్తత ఇచ్చారట. ఆస్తిని సేవా కార్యక్రమాలకు ఉపయోగించమని ట్రస్టులకు రాసిచ్చారట. ఈరోజుల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారా అని వీళ్ల గురించి తెలిసినోళ్లందరు అవాక్కైతున్నారు.