మహిళా మంత్రికి 3 నెలల జైలుశిక్ష.. ఇదీ నేరం..  - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా మంత్రికి 3 నెలల జైలుశిక్ష.. ఇదీ నేరం.. 

October 17, 2020

Court awards 3-month jail to Maharashtra minister Yashomati Thakur in 2012 cop assault case

ఎంత మంత్రి అయితే మాత్రం విధుల్లో ఉన్న పోలీసు మీద చేయి చేసుకోవడానికి వీలు లేదు. అధికారం చేతిలో ఉందని అధికార దుర్వినియోగానికి పాల్పడితే చట్టాలు ఊరుకోవు కదా. ఈ మహిళామంత్రి విషయంలో అదే జరిగింది. విధుల్లో ఉన్న పోలీసు చెంప మీద కొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖామంత్రి యశోమతి ఠాకూర్‌కు అమరావతి కోర్టు మూడు నెలల జైలుశిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా కూడా విధించింది. ఎనిమిదేళ్ల క్రితం యశోమతి ఠాకూర్ అమరావతి జిల్లాలోని అంబాదేవి ఆలయం సమీపంలో ఉల్హాస్ రౌరాలే అనే పోలీసు మీద చేయి చేసుకున్నారు. 

ఆ సమయంలో ఆమె కారు డ్రైవర్, మరో ఇద్దరు మద్దతుదారులు కూడా ఆ పోలీసు మీద విరుచుకుపడ్డారు. దీంతో బాధిత పోలీసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమరావతి పోలీసులు మంత్రి యశోమతిపై కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మంత్రితో పాటు మిగతా వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ మేరకు 3 నెలల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై ఆమె స్పందించారు. ‘నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఈ తీర్పు 8 సంవత్సరాల తరువాత వచ్చింది.
కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు అప్పీల్ చేస్తాను. బీజేపీతో సైద్ధాంతికంగా పోరాటం చేస్తున్నాను. బీజేపీ నాయకులు నా కెరీర్‌ను అణగదొక్కాలని అనుకుంటున్నారు. అందుకే నా రాజీనామా డిమాండ్‌ చేస్తున్నారు’ అని యశోమతి ఠాకూర్‌ మీడియాతో చెప్పారు. కాగా, మహారాష్ట్రలోని తేవ్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యశోమతి ఠాకూర్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె అమరావతి జిల్లా సంరక్షక మంత్రిగా కూడా ఉన్నారు.