వివేకాపై తొలి గొడ్డలి వేటు శంకర్ రెడ్డిదే... - MicTv.in - Telugu News
mictv telugu

వివేకాపై తొలి గొడ్డలి వేటు శంకర్ రెడ్డిదే…

March 24, 2022

 8

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉమా శంకర్ రెడ్డి.. బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకుని.. కోర్టు పై నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో కోర్టులో సీబీఐ తన వాదనను వినిపించింది. వివేకాపై మొదట గొడ్డలి వేటు వేసింది ఉమా శంకర్ రెడ్డేనని స్పష్టం చేసింది. మిగతా ముగ్గురు నిందితులతో కలిసి హత్య చేసి తెల్లవారు జామున పారిపోతున్న దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన విషయాన్ని కోర్టు ముందుంచింది. అప్రూవర్‌గా మారిన, నిందితుల్లో ఒకరైన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఉమా శంకర్ రెడ్డి కీలక నిందితుడని పేర్కొంది. బెయిలిస్తే హత్యకు ఉపయోగించిన ఆయుధాలు కనిపించకుండా పోయే ప్రమాదముందని తెలిపింది. ఇప్పటికే బెయిలిచ్చిన ఐదో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనీ, వాంగ్మూలం ఇచ్చేందుకు మొదట ఒప్పుకుని ఆ తర్వాత నిరాకరించిన గంగాధర్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య ఉదంతాలను ఉదాహరణగా చూపింది. అంతేకాక, ఇప్పటికే కడప కోర్టు రెండు సార్లు, హైకోర్టు ఒకసారి బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసిన విషయాన్ని కోర్టుకు గుర్తు చేసింది. దీంతో సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.