Court granted bail to MLC Anantha Babu
mictv telugu

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరు.. ఎన్ని రోజులంటే

August 22, 2022

Court granted bail to MLC Anantha Babu

ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆయన పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆయనకు కోర్టు మూడ్రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఆయన తల్లి అనారోగ్య కారణాలతో ఆదివారం మరణించగా, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును అభ్యర్ధించారు.

దీంతో కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడ్రోజుల పాటు ఎల్లవరం గ్రామాన్ని బయటకు రాకూడదని పేర్కొంది. కేవలం తల్లి అంత్యక్రియల కోసం మాత్రమే ఇంటినుంచి బయటకు రావాలని ఆదేశించింది. కేసు గురించి ఎవరితోనూ ఎక్కడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. ఎల్లప్పుడూ పోలీసులు వెన్నంటే ఉండాలని, మూడ్రోజుల తర్వాత అంటే ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటల్లోగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోవాలని ఉత్తర్వులలో ఆదేశించింది. బెయిల్ కోసం రూ. 25 వేల బాండు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని వెల్లడించింది.