డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రథం దగ్ధం కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసులో కాకినాడ వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెల్లడించింది. రూ.84 లక్షల పరిహారంతో పాటు ఖర్చుల నిమిత్తం రూ.30వేలను చెల్లించాలని ఆదేశించింది.
స్వామివారి రథం దగ్థమైన కేసులో యునైటెట్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రూ.84 లక్షలు నష్టపరిహారం, ఖర్చుల కింద మరో 15 లక్షలు చెల్లించాలని దేవస్థానం అధికారులు కాకినాడ వినియోగదారుల ఫోరాన్ని 2021 ఏప్రిల్ 4న ఆశ్రయించారు. దీనికి కంపెనీ నిరాకరించింది. ఘటన ప్రమాదవ శాత్తు జరగలేదని..చెబుతూ నష్టపరిహారం ఇచ్చేది లేదని కోర్టులో వాదనలు వినిపించింది.
కాకినాడ కోర్టు పరిధిలోకి ఈ కేసు రాదని వివరించారు. దీనిపై ఎండోమెంట్ ప్యానల్ న్యాయవాది వాధిస్తూ భగవంతుడు సర్వాంతర్యామి అని, కాకినాడలో ఎండోమెంట్ కార్యాలయం ఉందని, అందువల్ల కేసును ఇక్కడే విచారించాలన్నారు. ఈ వాదనలు విన్న ఫోరం.. రూ.84 లక్షల పరిహారంతో పాటు ఖర్చుల నిమిత్తం రూ.30వేలను యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని ఆదేశించింది. తీర్పు వెలువరించిన 45 రోజులలోపు బీమా అందించాలని తీర్పులో వెల్లడించారు.
అంతర్వేది ఆలయంలో స్వామివారి ఊరేగింపు రధం దగ్థం అవ్వడంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. బిజెపి, టిడిపి, జనసేన వంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. రథం అర్ధరాత్రి మంటల్లో పూర్తిగా కాలిపోవడానికి మతిస్థిమితం లేని యాకోబు అలీ కారణమని ఆరోపిస్తూ అతడిని పోలీసుల అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు. తర్వాత అతడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.