కోర్టు తీర్పు నేరగాళ్లకు ఓ హెచ్చరిక.. వరంగల్ చిన్నారి కన్నవాళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టు తీర్పు నేరగాళ్లకు ఓ హెచ్చరిక.. వరంగల్ చిన్నారి కన్నవాళ్లు

August 8, 2019

Court verdict is a warning to criminals

వరంగల్ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగం ప్రవీణ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దోషికి సరైన శిక్ష విధించారని, కామాంధుడిని ఒకేసారి కాకుండా వేపి వేపి చంపాలని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే కోర్టు తీర్పుపై చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులు రచన, జగన్‌లు కూడా స్పందించారు. తమ కుమార్తె శ్రీహితను హత్య చేసిన నిందితుడికి  కోర్టు మరణశిక్ష ఖరారు చేయడంతో వారు ఈ రోజు సాయంత్రం వరంగల్ పోలీస్ కమీషనర్ డా. వి.రవీందర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష పడటంలో వరంగల్ కమీషనర్ పోలీసుల కృషి తమకు సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమీషనర్‌తో పాటు హన్మకొండ ఎ.సి.పి శ్రీధర్ గారు అందించిన సహకారం, మనోధైర్యం మరువలేనిదని అన్నారు.  ముఖ్యంగా నిందితుడికి కేవలం 48 రోజుల్లో మరణ శిక్ష ఖరారు కావడంతో వరంగల్ పోలీసులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇలాంటి తీర్పుతో నేరాలకు పాల్పడేవారికి ఒక హెచ్చరికగా నిలిచిందని చిన్నారి తల్లిదండ్రులు పోలీస్ కమీషనర్‌కు తెలిపారు.