మనకు రోడ్డు మీద కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ అప్పుడప్పుడూ డబ్బు దొరకుతూ ఉంటుంది. వాటిని తిరిగిద్దామంటే పోగొట్టుకున్న వాళ్లు ఎవరో మనకు తెలియదు. పోనీ మనం ఉంచుకుందామంటే ఒక రకమైన భయమేస్తూ ఉంటుంది. ఏదో వందా, రెండొందలైతే పర్వాలేదు కానీ, పెద్ద మొత్తంలో గనక డబ్బు దొరికితే ఏం చేయాలో ఈ వార్త చదివిన తర్వాత మీకే అవగాహన వస్తుంది. వివరాల్లోకెళితే.. చత్తీస్గఢ్ బాలోద్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి బ్యాంకు నుంచి 25 లక్షలు డ్రా చేసుకొని ఇంటికి వెళుతుండగా, మార్గమధ్యంలో డబ్బు సంచీని పోగొట్టుకున్నాడు. ఇంటికి వెళ్లి చూడగా డబ్బు సంచీ లేకపోవడంతో వెనక్కి వచ్చి రోడ్డంతా వెతికాడు.
దొరక్కపోవడంతో ఒకవేళ బ్యాంకులో ఏమైనా మర్చిపోయానా అంటూ అక్కడా వెతికాడు. లాభం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాుదు చేశాడు. వారు సీసీ కెమెరాలను చూడగా, బైకుపై వెళ్తున్న ఓ జంట ఆ డబ్బు సంచీని తీసుకెళ్లినట్టు గుర్తించారు. వెంటనే బైకు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ జంటను పట్టుకుని డబ్బు రికవరీ చేసి వారిపై దొంగతనం కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, వాదనలు విన్న కోర్టు జంటపై నమోదు చేసిన దొంగతనం (మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండు) కేసును కొట్టివేసింది. అయితే మరో సెక్షన్ 403 అంటే నిజాయితీ లేకుండా ఇతరుల సొమ్మును అపహరించడం (రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండు) కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చూశారుగా, రోడ్డుపై డబ్బు దొరికింది కదా అని ఇంటికి తీసుకెళ్లకూడదు. డబ్బు పెద్దమొత్తంలో ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్కు వెళ్లి అప్పగించాలి. లేదంటే కటకటాల పాలు కావాల్సి ఉంటుంది.