ద్యావుడా.. మాస్క్ తీయకుండానే తినేయొచ్చు (వీడియో) - Telugu News - Mic tv
mictv telugu

ద్యావుడా.. మాస్క్ తీయకుండానే తినేయొచ్చు (వీడియో)

May 19, 2020

Mask

కరోనా పుణ్యమా అని ఇప్పుడందరూ మాస్కులను వాడుతున్నారు. ఇప్పుడదే కరోనా నుంచి కాపాడే కవచం అయింది. అయితే ఈ మాస్కులలో రకరకాల మాస్కులను తీసుకువస్తున్నారు. కరోనా వ్యాప్తితో మాస్కులకు డిమాండ్ పెరగడంతో తొలుతలో దాని రేటును అమాంతం పెంచి అమ్మారు. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్యంయంగా కుట్టిన మాస్కులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మరో అడుగు ముందుకేస్తూ కొందరు అందమైన డిజైన్లతో మాస్కులను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ఓ మాస్కుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఓ వ్యక్తి మాస్కు తీయకుండానే భోజనం చేసేస్తున్నాడు. అదేంటని ఆశ్చర్యపోకండి. ఆ మాస్కును అలా డిజైన్ చేశారు కాబట్టి మాస్క్ తియ్యకుండానే అన్నం తినొచ్చు. 

ఆ మాస్కును రిమోట్ కంట్రోల్ సహాయంతో తయారుచేశారు. నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఇది పెట్టుకుని భోజనం చేయడం ఎంతో సులువు. దానికి ఉన్న బటన్‌ను నొక్కితే నోటి దగ్గర మాస్కును అచ్చం మన నోరులానే తెరుచుకుంటుందది. అప్పుడు ఎంచక్కా నోట్లో ముద్ద పెట్టుకోవచ్చు. ఎంతో సులువుగా దీంతో భోజనం ముగించవచ్చు. ఈ మాస్కును ఇజ్రాయెల్ ఇన్వెంటర్స్ తయారు చేశారు. దీని గురించి అవ్టీపస్ పేటెంట్స్ అండ్ ఇన్వెన్షన్స్ ఉపాధ్యక్షుడు అసఫ్ గిటెలీస్ మాట్లాడుతూ.. ‘మనం ఆహారం తినే సమయంలో మాస్కు దానంతటదే తెరుచుకుంటుంది. ఫోర్క్‌ను మాస్క్ దగ్గరకు తేగానే గుర్తించి అది ఓపెన్ అవుతుంది. ఫోర్క్‌ను దూరం పెట్టగానే మళ్లీ మూసుకుపోతుంది. లేదంటే బటన్ నొక్కి కూడా మాస్కును మూస్తూ తెరవొచ్చు. త్వరలోనే ఈ మాస్కును మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాం’ అని వెల్లడించారు. కాగా, ఈ మాస్క్ ధరించి ఐస్ క్రీమ్ తినడం, జ్యూస్‌లు తాగడం మాత్రం కుదరదని నెటిజన్లు అంటున్నారు.