లాక్‌డౌన్.. ఒక్కరోజే 2 వేల బండ్లు, 330 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్.. ఒక్కరోజే 2 వేల బండ్లు, 330 కేసులు

March 24, 2020

gn bg nvb

ముఖ్యమైన పనులు ఉంటేనే బయటికి రావాలని.. లాక్‌డౌన్‌కు ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండి సహకరించాలని పోలీసులు హెచ్చిరిస్తున్నారు. సరదాగా రోడ్ల పైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు ఎంత చెప్పినా కొందరు ఖాళీ రోడ్లపైకి షికార్లకు వచ్చారు. దీంతో పోలీసులు హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే (మార్చి 23, 2020) 2వేలకు పైగా వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. వీటిలో 1058 బైక్‌లు, 948 ఆటోలు, 429 కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, 45 ఇతర వాహనాలు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని అన్ని మార్గాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలే అని మరీ మరీ చెబుతున్నారు. నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 73 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

ట్రాఫిక్‌ విభాగం అదనపు పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. ‘సోమవారం మొత్తం 2480 వాహనాలను సీజ్‌ చేశాం. ప్రభుత్వం జారీ చేసిన GO-45, 46 ప్రకారం.. లాక్‌డౌన్‌ పాటించని వాహనదారులు, ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నగరాన్ని కరోనా ఫ్రీ నగరంగా ఉంచాలి’ అని కోరారు. మరోవైపు లాక్‌డౌన్‌పై  ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఏపీ డీజీపీ సవాంగ్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ మన చేతుల్లోనే ఉందని వెల్లడించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 330 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని.. ఫోర్‌ వీలర్‌లో ప్రయాణించేందుకు ఇద్దరికే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఎమర్జెన్సీ అయితే ఇద్దరు మాత్రమే బయటికి రావాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చినవారు 104, 100కి సమాచారం ఇవ్వాలని డీజీపీ సవాంగ్ కోరారు.