మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం.. మే 31 వరకు.. - MicTv.in - Telugu News
mictv telugu

మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం.. మే 31 వరకు..

May 17, 2020

Lockdown 4.0.

రోజురోజుకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. దీంతో లాక్‌డౌన్ అనివార్యమైంది. కేసుల రీత్యా దఫాల వారిగా లాక్‌డౌన్‌ను  కేంద్రం పొడిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) మే 17 (ఆదివారం) ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ 4.0 నిబంధనలను జాతీయ ఎక్జిక్యూటివ్ కమిటీ (ఎన్ఈసీ) వెల్లడిస్తుందని.. అప్పటివరకు ప్రస్తుత నిబంధనలే అమలులో ఉంటాయని స్పష్టంచేసింది. 

మరో 14 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. లాక్‌డౌన్ 3.0 గడువు నేటితో ముగుస్తుండగా చివరి నిమిషంలో కేంద్రం ఈ ఉత్తర్వులు వెలువరించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఎక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులు ప్రకటించనున్నాయి. కాగా, కేంద్రానికన్నా ముందే మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు కూడా మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి.