మళ్లీ కరోనానే.. వాయిదాపడ్డ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ కరోనానే.. వాయిదాపడ్డ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

May 22, 2020

COVID-19: Nizamabad MLC bypoll postponed

కరోనాతో పెళ్లిళ్లు, పేరంటాలే వాయిదా పడుతున్నాయి. పండగలు పబ్బాలకు కూడా మనుషులు దూరమయ్యారు. ఈ క్రమంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదాపడ్డాయి. ఎమ్మెల్సీ స్థానానికి మే 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, లాక్‌డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదని ఉప ఎన్నికను మళ్లీ వాయిదా వేశారు. గతంలో పొడిగించిన గడువు ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 45 రోజులకు పొడిగించింది. ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక రావడంతో మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. మే 7న ఎన్నికలు జరుగుతాయంటూ షెడ్యూల్‌ వచ్చింది. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎన్నికలు వాయిదా పడక తప్పని పరిస్థితి ఏర్పడింది.  

నిజామాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ నాటి మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా, ఈ స్థానం నుంచి ఈసారి టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.