సుప్రీం కోర్టుకు కరోనా తాళం.. ఇళ్ల నుంచే వాదనలు  - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం కోర్టుకు కరోనా తాళం.. ఇళ్ల నుంచే వాదనలు 

March 23, 2020

COVID-19 SC to hear cases via video conference.

ఎన్నో కేసులను శాసించే అత్యున్నత న్యాయస్థానాన్ని కరోనా వైరస్ శాసిస్తోంది. దేశంలో రోజురోజుకు తన వికృతరూపాన్ని ప్రదర్శిస్తున్న కరోనా ప్రభావంతో.. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదని సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అత్యవసర కేసుల్ని వాదించాలని సూచించింది. ఈ విషయమై  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బోబ్డే మాట్లాడుతూ.. ‘న్యాయవాదులకు కొన్ని లింక్‌లు ఇస్తాం. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని వీడియో కాల్‌ కనెక్ట్‌ చేసుకోవచ్చు. అప్పటి వరకు కోర్టు భవనంలోని లాయర్ల ఛాంబర్లన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీచేశాం. లాయర్ల ఎలక్ట్రానిక్‌ పాస్‌లను కూడా రద్దు చేశాం’ అని తెలిపారు. 

నేటి సాయంత్రం ఐదు గంటల నుంచి కోర్టులోని లాయర్ల ఛాంబర్లకు తాళాలు వేయనున్నారు. ఏమైనా ముఖ్యమైన పత్రాలు ఉంటే  రేపు సాయంత్రం కల్లా న్యాయవాదులు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. కాగా, కరోనా వ్యాప్తి వేగవంతం అవడంతో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగానే కోర్టు కూడా తాజా నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 415 కరోనా కేసులు నమోదు కాగా.. ఏడుగురు చనిపోయారు.