ఐడియా అదుర్స్.. దయ్యాల పల్లెల్లో క్వారంటైన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఐడియా అదుర్స్.. దయ్యాల పల్లెల్లో క్వారంటైన్

May 15, 2020

Uttarakhand

మూడో విడత లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు చేసి వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చినవారిని క్వారంటైన్ చేయడం రాష్ట్రాలకు ఓ సవాల్‌గా మారింది. దీనికి ఉత్తరాఖండ్ రాష్ట్రం చక్కని పరిష్కారం కనుగొంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ప్రజలు ఖాళీ చేసిన గ్రామాలను వలస కార్మికులకు క్వారంటైన్లుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆ రాష్ట్రంలో సరైన వసతులు లేని గ్రామాలను ప్రజలు ఖాళీ చేయడంతో ఊళ్లు ఖాళీ అయ్యాయి. దీంతో పాడుబడిన ఆ గ్రామాలను దెయ్యాల గ్రామాలుగా పిలుస్తుంటారు. ఇప్పుడా దెయ్యాల గ్రామాలే ఆపద సమయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పనికి వస్తున్నాయి.

సాధారణ గ్రామాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేస్తే వైరస్ వ్యాపిస్తుందని ఉత్తరఖండ్ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఈ దెయ్యాల గ్రామాల్లో అయితే ఎవరికీ సమస్య ఉండదని ఉత్తరాఖండ్ అధికారులు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని పావురీ జిల్లాలో ఇలాంటి దెయ్యాల గ్రామాలు 186 వరకు ఉన్నాయట. ఇప్పుడు చాలా గ్రామాల్లో సదుపాయాలు కల్పించారు. ఇళ్లను శుభ్రం చేయించి క్వారంటైన్ కోసం వినియోగిస్తున్నారు. కాగా, నెమ్మదిగా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న కరోనా వైరస్ మ‌ళ్లీ పంజుకుంటోందని వివిధ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేల సంఖ్యలో కార్మికులు తరలి వస్తుండడంతో వారికి ఎక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వాలకు ఓ సమస్యగా మారింది. ఈ క్రమంలో ఉత్తరఖండ్ ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది.