కొత్త ముఖాలు కనిపిస్తే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి..
లాక్‌డౌన్ సడలింపులతో దేశమంతా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మద్యం దుకాణాలతోపాటు చాలా పరిశ్రమలను తెరవడం, కిరాణా షాపుల్లో, మార్కెట్లలో భౌతిక దూరానికి గండి కొట్టడం, ప్రయాణాల వల్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అనుమానితుల్లో చాలామంది క్వారంటైన్, హోం క్వారంటైన్లలో ఉండటానికి ఇష్టపడ్డం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్ల కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో సూచన చేసింది.
ఆయా ప్రాంతాల్లో కొత్త ముఖాలు కనిపిస్తే తమకు సమాచారం అందివ్వాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ర్ జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో కోరారు. పట్టణాలకు, గ్రామాలకు కొత్తవాళ్లు, వలస కూలీలు వచ్చినట్లు తెలిస్తే స్థానిక అధికారులకు చెప్పాలని, కోవిడ్ కాల్‌సెంటర్ 104కు కూడా ఫోన్ చేసి చెప్పొచ్చని తెలిపారు. వివిధ రాష్ట్రాలను వస్తున్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి జిల్లాల్లోని అంతర్రాష్ర్ట సరిహద్దుల్లోని 87 చెక్‌పోస్టుల వద్ద 275 మంది ఆరోగ్య బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఏపీ, మహారాష్ట్రలకు అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని కోరారు.