కరోనా నుంచి కోలుకుంటున్నాం.. పరిస్థితులు చక్కబడ్డాయి..అనే సమయంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తుంది. చైనాను వణికిస్తున్న కరోనా ప్రపంచ దేశాలను భయపెడుతోంది. భారత్ దేశంలో కూడా క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే పలు రాష్ట్రాలలో కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఏపీలో కరోనా కేసులో వెలుగు చూశాయి. విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యింది. విశాఖపట్టణంలోని రైల్వే న్యూ కాలనీకి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కూడా వైరస్ సోకింది. దీనిని వైద్యులు సైతం నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం విజయవాడలోని ల్యాబ్‌కు పంపారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. కుప్పం పీహెచ్సీలో ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో అదే రోజు రాత్రి ఆ వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఐడీహెచ్ వార్డులోని కొవిడ్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడికి ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ.. అతడిలో ఎలాంటి లక్షణాలు లేవని వైద్యలు తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టు నమూనాలు సేకరించారు. అయితే బాధితుడు మంగళవారం మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెలిపోవడం కలకలం రేపుతోంది. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.