Covid epidemic is not yet over, says Dr. Richard Hatchett
mictv telugu

కరోనా ఇంకా పోలేదు.. కొత్త వ్యాధులు పొంచి ఉన్నాయ్‌

February 25, 2023

కరోనా తగ్గుముఖం పట్టడంతో కొన్నాళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఉపశమనం పొందుతున్నాయి. అయితే వైరస్‌ పూర్తిగా నశించిందని ఏమరుపాటుగా ఉండొద్దంటున్నారు ‘కొలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌(సెపీ-యూకే) సీఈవో డాక్టర్‌ రిచర్డ్‌ హాచెట్‌ . కరోనాలో ఎప్పటికప్పుడూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జన్యు పరిణామ క్రమంలో ఒక్కోసారి వైరస్‌ విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల దాని పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుండాలన్నారు. కొవిడే కాకుండా మరెన్నో కొత్త వ్యాధులు పొంచి ఉన్నాయని.. వాటి విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

మార్పులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలని, ప్రస్తుతం వైరస్‌లు ఏవీ లేవు కదా అని ఏమరుపాటుగా ఉండొద్దన్నారు. మన అప్రమత్తం అయ్యే వరకూ వైరస్‌లు వేచిచూడవన్నారు. “మూడేళ్ల కిందట కొవిడ్‌-19 విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పుడు నిపా వైరస్‌ పొంచి ఉంది. హెచ్‌5ఎన్‌1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ఇప్పటికే స్పెయిన్‌లో దడ పుట్టిస్తోంది. ఇది కూడా అత్యంత వేగంగా మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుంది. దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో గన్యా ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఉగాండాను ఎబోలా వైరస్‌ కుదిపేస్తోంది. ఏ వ్యాధి లేదా వైరస్‌ ఎక్కడి నుంచి, ఎప్పుడు ఉద్భవిస్తుందో అంచనా వేయలేం. కొత్త కొత్త ఉపద్రవాలకు మనం సిద్ధపడాల్సిందే. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే” అని అన్నారు

టీకాలు కనుగొనని మొండి వ్యాధులు ఇప్పటికీ అనేకం ఉన్నాయని.. అలాంటి వాటిని కట్టడి చేయడమే లక్ష్యంగా సెపీ పనిచేస్తోందని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాధి నిరోధక టీకాలపై పరిశోధనలు, ప్రయోగాలకు సెపీ ఆర్థికంగా ఊతం అందిస్తోందని.. పరిశోధనలు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోందని పేర్కొన్నారు. కేవలం 100 రోజుల్లో టీకాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.