కరోనా ఎక్కడ పుట్టింది.? కచ్చిదంగా చైనాలోనే పుట్టిందా..? వన్యప్రాణుల పెంపక కేంద్రం నుంచే వైరస్ వ్యాపించిందా..?లేదా గబ్బిలాల వల్లే వైరస్ సంక్రమించిందా..? అనే విషయాలపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. వైరస్‌పై రోజుకో షాకింగ్ విషయం బయటకువస్తోంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాలు గబ్బిలాల నుంచి కరోనా వైరస్ వచ్చిందని పేర్కొన్నాయి. అయితే తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనలో శునకాల నుంచి వైరస్ సంక్రమించిందని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. చైనాలోని వూహాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి సేకరించిన జన్యు నమూనాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు మార్కెట్లో చైనీయులు అమ్ముతున్న రకూన్ డాగ్స్ నుంచే ఈ వైరస్ సంక్రమించిందని తేల్చేశారు.
అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తెలిపిన తమ పరిశోధన వివరాలను న్యూయార్క్ టైమ్స్ తన పత్రికలో ప్రచురించింది. 2020లో కొంతమంది శాస్త్రవేత్తలు వూహాన్ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడి శాంపిల్స్‌ను సేకరించారు. అయితే అప్పటికే కొత్త వైరస్ భయంతో మార్కెట మొత్తం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మార్కెట్లోని గోడలపై, నేలపై, జంతువులను ఉంచే పంజరాల్లో నమూనాలను సేకరించారు. వాటిపై సుదీర్ఘంగా అధ్యయం చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో అత్యధిక భాగం రకూన్ డాగ్స్‌తో సరిపోయాయని శాస్త్రవేత్తల బృందం తేల్చేసింది. కాలిఫోర్నియాలో స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అరిజోనా, సిడ్నీ వర్సిటీల వైరాలజిస్టులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. అయితే రకూన్ డాగ్స్ నుంచి మనుషులకు కరోనా వైరస్ నేరుగా సంక్రమించిందా..లేదా శునకాల నుంచి మరో జంతువులకు వ్యాపించిందా..అలా మనుషులకు చేరిందా అనే విషయాలపై సైంటిస్టులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.