ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. తొలిసారి కొవిడ్ బయటపడిన చైనాలో ఆ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అక్కడ వైరస్ ఉధృతికి ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 కారణమని నిపుణులు తేల్చారు. ఈ వేరియంట్ భారత్‌లోనూ బయటపడింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు తెలిపాయి.
ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రత్యేక సమావేశానికి పిలపునిచ్చారు. మరోవైపు పండుగ రోజులు కావడంతో బయట ఎక్కువగా తిరగకూడదని, పెళ్లిళ్లు, రాజకీయ, సామాజిక మీటింగులు, అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 163 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి ఒకరు మరణించారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను భారత ప్రభుత్వం ఆమోదించింది. ముందుగా ఇవి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగితే దానికి ముందస్తు సన్నద్ధతగా.. దేశంలోని ఆస్పత్రిల్లో డిసెంబర్ 27న మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి.