ఆవులకు పిల్లనగోవి వినిపిస్తే ఎక్కువ పాలు.. బీజేపీ ఎమ్మెల్యే
ఆవుకు, శ్రీకృష్ణుడికి అవినాభావ సంబంధం వుంది. రేపల్లె గోపాలుడు పరవశంతో పిల్లనగోవి ఊదుతూ గోవులను మైమరిపించాడని పురాణకథల్లో చదువుకున్నాం. ఆయన వేణుగానానికి పరవశించిన ఆవులు పాలు ఎక్కువగా ఇచ్చేవని చెబుతుంటారు. అది ద్వాపర యుగానికి సాధ్యమైంది అనేవాళ్లకు.. కలియుగంలో కూడా అది సాధ్యమైంది అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్.
ఈ ఆధునిక యుగంలో సైతం పురాణాల్లో మాదిరిగానే వేణుగానం వినిపిస్తే ఇప్పటి ఆవులు, గేదెలు సైతం పాలు అధికంగా ఇస్తాయని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. రైతులు తమ పశువులకు ఫ్లూట్ ఊది సంగీతం వినిపిస్తే అవి తదాత్మ్యం చెంది పాలు ఎక్కువగా ఇస్తాయని తెలిపారు. ఇదంతా శాస్త్రీయంగా సైతం రుజువైందని ఆయన తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. తాను చెప్పేవి గాలిమాటలు కావని.. దీనిపై గుజరాత్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ పరిశోధన చేసి ఈ విషయం బయటపెట్టిందని ఆయన సెలవిచ్చారు.