CPI announced support to TRS in munugodu By-election
mictv telugu

టీఆర్ఎస్‌తో కలిసి బీజేపీని ఓడిస్తాం.. సీపీఐ నేత చాడ

August 20, 2022

మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కావాల్సిన మరో ముందడుగు వేసింది. ఆ పార్టీకి మద్ధతిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట రెడ్డి వెల్లడించారు. ఈ మద్ధతు మునుగోడుకే పరిమితం కాదని భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఉప ఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించాలంటే టీఆర్ఎస్‌కు మద్ధతివ్వాలని నిర్ణయించుకున్నాం. మునుగోడులో శనివారం బహిరంగ సభకు రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. అందుకే మా పార్టీ నేతలు వెళ్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉంది. ప్రస్తుతం దేశంలో బీజేపీని ఓడించే సత్తా ఉన్న నాయకుడు కేసీఆరేనని నమ్ముతున్నాం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది. మాకిచ్చిన మూడు సీట్లలో అభ్యర్ధులను నిలిపి పోటీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టారు కాబట్టే ఆ పార్టీకి మద్ధతివ్వట్లేదు’ అని పేర్కొన్నారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఐదు సార్టు కాంగ్రెస్ గెలువగా, మరో ఐదు సార్లు సీపీఐ గెలిచింది. కమ్యూనిస్టులకు మంచి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చాలా మేలు జరుగుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.