బీజేపీ, ఆరెస్సెస్ అనుసరిస్తున్న విధానాలతో భారత్ హిందూ దేశంగా మారే ప్రమాదం కనపడుతోందని సీపీఐ జాతీయ స్థాయి నేత డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ అధికార బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశంలో లౌకికత్వం డేంజర్లో పడిందని, సమాఖ్య స్పూర్తి దెబ్బతింటోందని ధ్వజమెత్తారు. విద్య, వైద్యం, ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్లకు కేంద్రం కొమ్ముకాస్తోందని మండిపడ్డారు.
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ విపక్ష పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు. ఆయా రాష్ట్రాలలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని, బీజేపీని ఓడించడమే అందరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రశంసించారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమన్నారు. కరెంటు కోతల లేమి, శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పథకాలు తేవాలని కోరారు. తెలంగాణను విముక్తం చేసిన సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నానన్నారు.