సీపీఐ నాయకుడు గుండా మల్లేశ్ కన్నుమూత..  - MicTv.in - Telugu News
mictv telugu

 సీపీఐ నాయకుడు గుండా మల్లేశ్ కన్నుమూత.. 

October 13, 2020

Cpi leader gunda mallesham no more

తెలంగాణ సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యమంతో బాధపడుతున్న ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని మఖ్దూం భవన్‌కు తరలించారు. స్వస్థలమైన బెల్లంపల్లి అంత్యక్రియలు జరుగుతాయి. 

ఆదిలాబాద్ జిల్లా తాండూర్ మండలం రేచిన గ్రామంలో జన్మించిన మల్లేశ్ నిత్యం ప్రజల హక్కుల కోసం, సంక్షేమం కోసం పోరాడారు. ఆసిఫాబాద్ నుంచి మూడుసార్లు, బెల్లంపల్లి నుంచి ఒకసారి అసెంబ్లీకి ఎన్నికై ప్రజావాణిని బలంగా వినిపించారు. మెట్రిక్యులేషన్ చదివిన ఆయన తొలుత క్లీనర్‌గా తర్వాత డ్రెవర్‌గా పనిచేశారు. అప్పటి నుంచే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా మారి ఉద్యమాలు నడిపించారు. 1970 దశకంలో సీపీఐలో చేరిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1983లో తొలిసారి ఆసిఫాబాద్ నుంచి కమ్యూనిస్టు జెండా తరఫున పోటీ పడి గెలిచారు.  2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికయ్యారు. మల్లేశ్ మృతి తీరని లోటు అని వామపక్షాల నాయకులు, ప్రసంఘాల నాయకులు నివాళి అర్పిస్తున్నారు. మల్లేశ్ మృతికి సీఎం కేసీఆర్ కూడా సంతాపం ప్రకటించారు.