కార్మికులు దోపిడీకి గురవుతారు, ప్రాంతాలు కూడా దోపిడీకి గురవుతాయి. దీన్ని అడ్డుకుని అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే రాజకీయ నాయకులు చాలా అరుదు. అలాంటివారిలో సీపీఐ నేత గుండా మల్లేశ్ ఒకరు. జీవితాంతం కష్టజీవుల వైపు నిలబడి సమస్త దోపిడీలకు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన అందర్నీ విడిచి వెళ్లిపోయారు. ఆయన పాటించిన విలువలు, నడిచిన మార్గాన్ని గుర్తుచేసుకునే చిన్న ప్రయత్నం ఇది.
మల్లేశ్ రాజకీయాల్లో వచ్చిన కాలం అత్యంత సంక్షుభితం. ఒకపక్క చల్లబడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలన, సింగరేణిలో ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రారంభం.. నడుమ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. స్వయంగా క్లీనర్‌గా, డ్రైవర్‌గా, సింగరేణ బొగ్గు కార్మికుడిగా పనిచేసిన మల్లేశ్ అన్యాయాన్ని ఎదుర్కోవడం, పదిమందిని చేరదీసి న్యాయం కోసం పోరాడడంతో అత్యంత సహజం. ఒకపక్క సీపీఐ సిద్ధాంతాలను, మరోపక్క తెలంగాణ ఆకాంక్షలను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకుసాగారు. అందుకే ఆసిఫాబాద్ ప్రజలు ఆయనను మూడుసార్లు, బెల్లంపల్లి ప్రజలు ఒకసారి తమ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపారు. బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం, సకల జనుల సమ్మెతోపాటు ఎన్నో ఉద్యమాల్లో ఆయన ముందంజలో సాగారు. ఫాసిస్టు ప్రభుత్వాల పాలనలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేశారు.
కమ్యూనిస్టు పార్టీ తరపున ఆయన అసెంబ్లీలో ప్రజల హక్కుల కోసం గళమెత్తారు. సీపీఐ శాసనసభాపక్ష నాయకుడిగా తన బాధ్యతలను పరిపూర్తిగా నిర్వర్తించారు. రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్తో కలసి ఉద్యమించారు. కమ్యూనిస్టులు పిడివాదులు అని పడికట్టు విమర్శ ఉంది. మల్లేశ్ కేవలం సిద్ధాంతాలకే పరిమితమైన మనిషికాదు, ఆయన స్వయంగా ఎన్నో ఉద్యోమాల్లో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కోసం కృషి చేశారు. పేరుప్రఖ్యాతులు వచ్చినా ఆయన ఎంతో వినయంగా ఉండేవారు. పదవుల కోసం పార్టీలు మారే కాలంలో మల్లేశ్ జీవితాంతం తను నమ్మిన పార్టీ వైపు నిలబడ్డం అంత సులువైందేమీ కాదు. పార్టీ ఎన్నికల్లో కోలుకోలేని విధంగా ఓడిపోయినా ఆయన నిరుత్సాహపడలేదు.