మోదీజీ.. మీ భార్యలాగే వీటిని కూడా వదిలేశారా? - MicTv.in - Telugu News
mictv telugu

మోదీజీ.. మీ భార్యలాగే వీటిని కూడా వదిలేశారా?

April 14, 2022

 

పేదలతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. అన్నింటి ధరలు పెంచుకుంటూ వెళ్తున్నారనీ, ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. గురువారం ఆయన నేతృత్వంలో పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ టిక్కెట్ ధరల పెంపుకు నిరసనగా తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. బస్ డిపో ముందు కూర్చొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రయాణీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆర్టీసీ చార్జీలను వ్యతిరేకించిన జగన్.. నేడు బాదుడే బాదుడు అంటూ కూని రాగాలు తీస్తున్నారు. ఆర్టీసీ ధరలు 150 శాతం పెరిగి ప్రజల నడ్డి విరుస్తోంది. ఇంతేకాక, ఇంకా పెంచుతామని సిగ్గులేకుండా ప్రకటనలు ఇస్తున్నారు. వెంటనే చార్జీలను తగ్గించాల’ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నారాయణ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘అదానీ, అంబానీలకు మేలు చేయడానికే చమురు ధరలను పెంచుతున్నారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్రం ఎందుకు వ్యతిరేకించడం లేదు. ప్రధాని మోదీ తన భార్యను వదిలేసినట్టే పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా వదిలేశారా? పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. రాష్ట్రం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి’ అంటూ ముగించారు.