సీపీఐ నారాయణ క్షమాపణ.. ఎన్‌కౌంటర్‌పై యూటర్న్  - MicTv.in - Telugu News
mictv telugu

సీపీఐ నారాయణ క్షమాపణ.. ఎన్‌కౌంటర్‌పై యూటర్న్ 

December 8, 2019

Cpi narayana.

చారిత్రక తప్పిదాలకు కమ్యూనిస్టులు పెట్టిందని పేరని, నారాయణ అందుకు తాజా ఉదాహరణ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణపై హక్కుల సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క ఆయన సొంత పార్టీకూడా  అక్షింతలు వేసింది. ఫలితంగా నారాయణ బహిరంగ క్షమాపణ చెప్పేశారు. 

దిశ హంతకుల ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ సరైందేనని, దీన్ని తమ పార్టీ సమర్థిస్తోందని నారాయణ అన్నారు. అత్యాచారాలు జరక్కుండా ఉండాలంటే ఎన్‌కౌంటర్లు చేయాలన్నారు.  దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కమ్యూనిస్టులు కూడా మారిపోతున్నారని కొందరు అభినందించగా, నకిలీ ఎన్‌కౌంటర్లను కమ్యూనిస్టులు ఎలా సమర్థిస్తారని, వారు పోలీసులతో ఎప్పుడు జట్టుకట్టారని మరికొందరు విరుచుకుపడ్డారు. గుళ్లుగోపురాలకు తిరిగే నారాయణ అలా కాకుండా మరెలా మాట్లాడతారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. 

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ వ్యాఖ్యలను నేతలు తప్పుబట్టారు. ఆయన వ్యవహారాలు సరిగ్గా ఉండడం లేదని ఆక్షేపించారు. దీంతో నారాయణ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘ నా మాటలు పార్టీ విధానాలకు భిన్నంగా ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ పార్టీ తీర్మానం చేసింది. సీపీఐ బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం. అందుకే నా వ్యాఖ్యలను నేను వాపసు తీసుకుంటున్నారు. ఇలాంటి పొరపాట్లు ఇక చేయను.. ’ అని అన్నారు.