టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఉపసంహరణ..  - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఉపసంహరణ.. 

October 14, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో చిక్కుల్లో పడ్డ సీపీఐ తాను కార్మికుల వెంటే ఉంటానని ప్రకటించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతివ్వాలో రేపు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం నుండే ఉంది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా  టీఆర్ఎస్‌కు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలి. హుజూర్ నగర్‌లో రేపు మా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై చర్చిస్తాం. మూడు రోజుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అనే అంశంపై మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. మేం ఎందుకు మద్దతు వాపసు తీసుకున్నామో టీఆర్ఎస్ ఆలోచించాలి.. ’ అని చాడ అన్నారు. 

huzur nagar assembly.

ఒకపక్క కార్మికులు సమ్మె చేస్తుండగా మరోపక్క వారిని ఇబ్బందులు పెడుతున్న పార్టీకి ఎలా మద్దతిస్తారని సీపీఐపై విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతలే దీన్ని తప్పుబట్టారు. దీంతో మద్దతుపై పునరాలోచిస్తామని పార్టీ ప్రకటించింది. సమ్మె ఉధృతం కావడం, కష్టజీవుల పార్టీగా మీరెటు వైపు ఉంటారని ప్రజాసంఘాలు, పార్టీలు, కార్మిక సంఘాలు నిలదీయడంతో సీపీఐ మనసు మార్చుకుంది. ఈ నెల 21న హుజూర్ నగర్ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 7వేల ఓట్లు కమ్యూనిస్టులకు ఉన్నట్లు అంచనా. మారిన పరిస్థితుల్లో సీపీఐ కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల బరిలో టీడీపీ, బీజేపీ కూడా ఉన్న సంగతి తెలిసిందే.