నీలి జెండాతో ఎర్రజెండా సోపతి ఓట్ల కోసమే.. - MicTv.in - Telugu News
mictv telugu

నీలి జెండాతో ఎర్రజెండా సోపతి ఓట్ల కోసమే..

April 23, 2018

సీపీఎం మహాసభల తీరుపై ఇప్పుడు జరుగుతున్న చర్చ, సాగుతున్ను విమర్శ ఇది. వర్గ పోరాటానికి దశాబ్దాల కిందట తిలోదకాలు ఇచ్చేసి, తోక పార్టీలా మారిపోయి, అన్ని పార్లమెంటరీ పార్టీల మాదిరే ఉనికి కోసం కుల పోరాటాన్ని ముందేసుకున్న మార్క్సిస్ట్ పార్టీ చేష్టలు దాని చిత్తశుద్ధిని వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ పార్లమెంటరీ మార్క్సిస్టులు.. వర్గ పోరాటం, కులపోరాటాలను కలగలసి సరికొత్త విప్లవం చేస్తున్నామని పైకి ఊదరగొడుతున్నా చేస్తున్నది మాత్రం పక్కా అగ్రవర్ణ, పురుషాధిక్య రాజకీయాలే అని పార్టీ జాతీయ  మహాసభలు తేల్చిచెప్పాయి.

జెండాలు సరే.. పగ్గాల మాటేమిటి?

‘ఎర్రదండుకు అండ నీలిజెండ’ అని సీపీఎం కొన్నేళ్ల కిందట కొత్త నినాదాన్ని అందకుంది. అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించుకుని పార్టీ తాజా మహాసభల్లో ఆమోదాన్ని కూడా పొందింది. మార్క్స్ వర్గపోాట మార్గదర్శకత్వంలో, అంబేద్కర్ దళితోద్యమ స్ఫూర్తితో దళితబహుజనులను  కదిలించాలని పథకాలను వర్కౌట్ చేస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు కామ్రేడ్లు. అయితే రాజ్యాధికారం సాధించాలంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కాకుండా అగ్రకుల పేదలను కలుపుకుని పోవాలని మార్క్సిస్ట్ పార్టీ భావిస్తోంది. ఐదు రోజుల పాటు జరిగిన సీపీఎం కేంద్ర మహాసభల్లో బహుజనులు, రాజ్యాధికారం అనే అంశాల మీద సుదీర్ఘంగా చర్చించింది. చర్చించి, చర్చించి చివరకు కీలక నిర్ణాయక కమిటీలను అగ్రవర్ణాలతో నింపిపడేసింది.

ఇదంతా బాగానే వుంది..

రాజ్యాధికారం కోసం లాల్ సలామ్, నీల్ సలామ్ అంటున్న మార్క్సిస్ట్ పార్టీ నినాదం కేవలం మాటలకే పరిమితమా? సీపీఎం మహాసభల తరువాత ఈ విషయం స్పష్టం అయింది. పార్టీ పదవుల్లో అగ్రకుల నాయకత్వం మాత్రమే కనిపించడం చర్చకు, తీవ్ర విమర్శలకు దారి తీసింది. కీలకమైన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం లేకపోవడం పార్టీ అగ్రవర్ణ మమకారానికి అద్దం పడుతోంది. 95 మందితో కేంద్ర కమిటీని, 17 మందితో పొలిట్ బ్యూరోను మహాసభ ఎన్నుకుంది. తెలుగు, ఆంధ్రా బ్రాహ్మణ కులానికి చెందిన సీతారాం ఏచూరిని ఆ పార్టీ జనరల్‌గా రెండోసారి ఎన్నుకున్నారు.

దళితులు లేరా? పనికిరారా?

పార్టీ పాలసీలను కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్ర ఆధారంగా తయారు చేసే సీపీఎం పొలిట్ బ్యూరోలో ఒక్క దళిత నాయకుడికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. యాభై మూడేళ్ల చరిత్ర కలిగిన మార్క్సిస్ట్ పార్టీలో పొలిట్ బ్యూరో స్థాయికి సరిపోయే దళిత నాయకుడు లేడా? లేకపోతే పొలిట్ బ్యూరోకు దళిత నాయకుడు పనికిరాడా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేరళ దళిత వర్గానికి చెందిన ఏకె. బాలన్ పేరును సీపీఎం పొలిట్ బ్యూరో కోసం పరిశీలించింది. కానీ ఆయన పేరును ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు అనే కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. ఇదిలావుంటే కేంద్ర కమిటీలోగానీ, పొలిట్ బ్యూరోలో గానీ మహిళలకు పెద్దగా ప్రధాన్యత ఇవ్వలేదు. కేవలం పద్నాలుగు మందికే అవకాశం ఇవ్వటం, పొలిట్ బ్యూరోలో కేవలం ఇద్దరిని మాత్రమే  రిక్రూట్ చేసుకోవటంపై కూడా చర్చ జరుగుతోంది.

యాభై మూడేళ్ళ చరిత్రలో ఇటు దళితుల్ని గానీ అటు మహిళల్ని గానీ రాజకీయంగా సీపీఎం పార్టీ తయారు చేసుకోలేదని సీపీఎం కేంద్ర మహాసభల తర్వాత అర్థమవుతోంది. పార్టీ విధాన పరమైన నిర్ణయాలల్లో మహిళలు కానీ దళితులు కానీ లేకపోవడం చర్చించాల్సిన విషయమే.