Craig Lewis lived for a month without a heart in usa
mictv telugu

గుండె లేకుండా నెల రోజులు బతికిన తొలి మానవుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

January 7, 2023

మనుషులతో సహా చాలా జీవులు బతికి ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం శరీరంలో ఉండే గుండె. ఇది ఒక్క నిమిషం ఆగిపోయినా మనిషి జీవితానికి నూకలు చెల్లినట్టే. కానీ ఓ వ్యక్తి గుండె లేకుండానే నెల రోజులు బతికాడంటే నమ్ముతారా? నమ్మలేని నిజాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఏవిధంగా చూసినా అసాధ్యమనిపించే ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకెళితే.. అమిలోయిడోసిస్ అనే అరుదైన వ్యాధికి గురైన క్రెయిగ్ లూయిస్ (55) అనే వ్యక్తి 2011లో ఆస్పత్రిలో చేరాడు. ఈ వ్యాధి వల్ల శరీరంలో అసాధారణమైన ప్రొటీన్ల పెరుగుదలకు కారణమవుతుంది. ఇది నేరుగా గుండె, మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం చూపి వాటి పనితీరును మందగిస్తుంది.
దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ కి చెందిన ఇద్దరు డాక్టర్లు బిల్లీకోన్, బడ్ ఫ్రేజియర్ లు పల్స్ లేకుండా రక్తం పంపిణీ చేయడానికి సహాయపడే పరికరాన్ని అమర్చారు. ఈ పరికరాన్ని ఇంతకుముందు 50 దూడలపై ప్రయోగించి సఫలమవడంతో విజయవంతంగా తొలిసారి మనిషి గుండె స్థానంలో అమర్చారు. ఇంకో విశేషమేంటంటే ఈ పరికరం పెట్టుకుంటే స్కెతస్కోప్ పెట్టి విన్నా లబ్ డబ్ అనే శబ్దం వినిపించదు. దీన్ని చూసి క్రెయిగ్ భార్య లిండా కూడా ఆశ్చర్యపోయింది. ఇలా నెలరోజులు బతికి వైద్యరంగంలో కొత్త చరిత్ర క్రియేట్ చేశాడు క్రెయిగ్. ఇలా గుండె సమస్య తీరిపోయిందనుకునే లోపు పాపం ఆ వ్యాధి కాలేయం, మూత్రపిండాలపై దాడి చేయడం ప్రారంభించింది. దీంతో క్రెయిగ్ పరిస్థితి క్రమంగా క్షీణించి చివరకి తుదిశ్వాస విడిచాడు. ఏదేమైనా గుండె లేకుండా నెల రోజులు బతికిన తొలి మానవుడిగా క్రెయిగ్ లూయిస్ నిలిచాడు.