Crazy yellow ant leaves cattle blind, villagers of seven villages in panic in Tamil Nadu
mictv telugu

చీమల’దండు’యాత్ర.. ఊళ్లను ఖాళీ చేస్తున్న జనం

August 30, 2022

తమిళనాడులోని అటవీ ప్రాంతాల్లో పలు గ్రామాల్లో చీమలు గుంపులుగా వచ్చి దండయాత్ర చేస్తున్నాయి. రాష్ట్రంలోని కరంతమలై రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘ఎల్లో క్రేజీ యాంట్స్’ అనే చీమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సన్నగా, చిన్నగా ఉండే ఈ చీమలు చాలా చురుగ్గా కదులుతాయి. ఈ చీమల దాటికి తట్టుకోలేక ప్రజలు గ్రామాలను ఖాళీచేసి వెళ్లిపోతున్నారు. ఇవి చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేస్తుంటాయి. ఒకటని కాదు ఏది దొరికితే దానిని తినేస్తాయి.

ఈ ప్రాంతాల్లో చాలా మంది వ్యవసాయం, పశువుల పెంపకంను జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈ చీమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. దీంతో ఇళ్లల్లోని పశువులు, మొక్కలు ఏవీ సురక్షితంగా లేవంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవి దగ్గరికి వెళ్లగానే చీమలు శరీరంపైకి చిరాకు తెప్పిస్తాయని, వీటి కారణంగా పొక్కులు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. గత కొన్నేళ్లుగా అడవిలో ఈ చీమలు చూస్తున్నామని, అయితే జనజీవనాన్ని అస్తవ్యస్తంచేస్తూ గ్రామాల్లో ఇంత పెద్ద సంఖ్యలో కనిపించడం ఇదే తొలిసారని స్థానికులు పేర్కొంటున్నారు. కొందరు గ్రామస్తులు చీమల గుంపు దాడిని తట్టుకోలేక గ్రామాల్లోని ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

ఈ చీమలు కుట్టవు, కరవవు. అవి విడుదలచేసే ఫార్మిక్ యాసిడ్ జంతువుల కళ్లను ప్రభావితం చేసి ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఫార్మిక్ యాసిడ్ పడినచోట దురద, చర్మం పొట్టులా రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ విషయంపై కీటక శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు దృష్టిసారించారు, నమూనాల్ని సేకరించి పరిశోధనకు పంపడంతో పాటు వాటి నైజాన్ని పరిశీలిస్తున్నారు.