ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు.. రోడ్ల విస్తరణ కోసమే.. !!! - Telugu News - Mic tv
mictv telugu

ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు.. రోడ్ల విస్తరణ కోసమే.. !!!

March 4, 2023

CRDA officials Demolish Illegal Buildings in Ippatam Village Guntur

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంటి ప్లాన్‌లను అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారన్న అభియోగంతో నగరపాలక సంస్థ అధికారులు మరోసారి కూల్చివేతలు మొదలుపెట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను రెండు జేసీబీల సాయంతో కూల్చివేశారు. స్థానికులు ఈ కూల్చివేతలను అడ్డుకున్నారు.. ఆందోళన వ్యక్తం చేశారు. అయినా నిరసనల మధ్యే సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.

ఈ కూల్చివేతల్లో ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని తనిఖీ చేసి, వారి వివరాలను నమోదు చేసుకొని గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ఆటో, బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో 70 అడుగుల రోడ్డును విస్తరించి ఏం సాధిస్తారని గ్రామస్థులు వాపోతున్నారు. జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు నరసింహారావు నివాసాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రహరీ వరకే కూల్చేసి వదిలేశారు. నగరపాలక సంస్థ అధికారుల చర్యలకు కొంతమంది ముందస్తుగా న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు.

గతంలో కూడా ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు, ప్రహరీలను కూల్చివేశారు. ఆ సమయంలోనూ ఉద్రిక్తత కనిపించింది. కొందరు కోర్టును ఆశ్రయించగా.. స్టే వచ్చింది. ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం వాసుల్ని పరామర్శించారు. జనసేన పార్టీ తరపున వారికి అండగా నిలిచారు.. ఆర్థికంగా సాయం కూడా అందించారు. ఇప్పుడు మరోసారి కూల్చివేతలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.