క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం అఫ్గానిస్థాన్ తో జరగనున్న మూడు వన్డే సిరీస్ ను రద్దు చేసుకుంది. దీంతో ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా ఆఫ్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన ఈ సిరీస్ క్యాన్సిల్ అయ్యింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల భాగమైన ఈ సిరీస్ నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో ఆ జట్టు కీలక పాయింట్లు కోల్పోనుంది. మ్యాచ్‌కి పది చొప్పున 30 పాయింట్లు ఆఫ్ఘన్ జట్టు ఖాతాలో చేరుతాయి. అఫ్గానిస్థాన్తాలిబన్ ప్రభుత్వం మహిళలు, అమ్మాయి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. ఆఫ్ఘాన్ విషయంలో గతంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. హోబర్ట్‌లో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను కూడా ఇదే కారణంతో రద్దు చేసుకుంది.
2021లో ఆఫ్ఘాన్‌లో అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్ల చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో మహిళల హక్కులను తాలిబన్లు కాలరాశారు. మహిళలకు కఠినమైన ఆంక్షలను విధించారు. క్రీడాల్లో పాల్గొనరాదని, ఉద్యోగానికి వెళ్లవద్దని రూల్స్ పెట్టారు. ఇస్లాం మత ఆచారాల ప్రకారం మహిళలు శరీర భాగాలు కనిపించేలా బట్టలు వేసుకుని క్రీడల్లో ఆడకూడదని తేల్చారు. దీంతో మహిళల జట్టు లేని ఏకైక ఐసీసీ శాశ్వత సభ్య దేశంగా కూడా ఆఫ్ఘనిస్థానే ఉంది. దీనిని క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. మహిళా హక్కులను కాలదొక్కుతున్న ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారితో ఆడాల్సిన వన్డే సిరీస్‌ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఆస్ట్రేలియా.