దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్ళుగా బెట్టింగులు నిర్వహిస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఈ కేటుగాడు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ తో ఈ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. మారియట్ హోటల్లో ఆన్ లైన్ క్యాసినో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో రెండుసార్లు అమిత్ గుజరాతి అరెస్ట్ అయ్యాడు.
అమిత్తో పాటు మరో 12 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసి , వారి వద్ద నుంచి రూ.20 లక్షల నగదును సీజ్ చేసినట్లు సెంట్రల్ జోన్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులతో పాటు 20 మొబైల్ ఫోన్లు, ఓ కారు , వైఫై రూటర్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తదుపరి విచారణ అనంతరం నిందితుణ్ని కోర్టులో హాజరుపరుస్తామని రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.