మైదానంలో మీసం మెలేసిన మోసం.. పదేళ్లలో మన క్రికెట్ ప్లేయర్ల పాపాలు ఇవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

మైదానంలో మీసం మెలేసిన మోసం.. పదేళ్లలో మన క్రికెట్ ప్లేయర్ల పాపాలు ఇవీ..

December 17, 2019

Cricket

2010-20 దశాబ్దంలో భారతీయ క్రికెట్‌‌లో గతంలో ఎన్నడూ జరగనన్ని  కుంభకోణాలు జరిగాయి. ఎందరో ఆటగాళ్లు, ఐపీఎల్ యాజమాన్య సభ్యులు బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఆటగాళ్లలో శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చౌహన్ ముఖులు. రాజస్థాన్ ఐపీఎల్ జట్టు యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ, అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్ అరెస్ట్ అయ్యారు. ఈ కుంభకోణం కారణంగా రాజస్థాన్, చెన్నై జట్లు రెండు సంవత్సరాలు నిషేధానికి గురయ్యాయి. మరొక కుంభకోణంలో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ధోని కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

 

శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకీత్ చవాన్ 

ఢిల్లీ పోలీసులు 2013 ఐపీఎల్ సీజన్ జరిగిన సమయంలో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలున్న క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకీత్ చవాన్‌లను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు 2013 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. శ్రీశాంత్‌ను అతని స్నేహితుడి ఇంట్లో అరెస్టు చేయగా, చండీలా, చవాన్‌లను ముంబైలోని తమ టీమ్ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ముగ్గురు ఆటగాళ్ల ఒప్పందాలను రాజస్థాన్ రాయల్స్ నిలిపివేసింది. స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నట్లు చవాన్ అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బుకీల ఆదేశాల మేరకు స్పాట్ ఫిక్సింగ్‌లో చవాన్ సహా ఇతర ఆటగాళ్లను పాల్గొనడానికి చండిలా ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు.

బీసీసీఐ తదుపరి దర్యాప్తు వరకు ఆటగాళ్లను సస్పెండ్ చేసింది. బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలే మాట్లాడుతూ..’బీసీసీఐ ఈ పరిణామాలను చూసి దిగ్భ్రాంతికి గురైంది. అవినీతిపై బీసీసీఐ సహనం వచించదు. ఈ విషయంలో దర్యాప్తులో ఢిల్లీ పోలీసులకు, ఇతర అధికారులందరికీ బీసీసీఐ సహకరిస్తుంది. ఇందులో పాల్గొన్న క్రికెటర్లపై కఠినంగా వ్యవహరించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది.. ’ అని తెలిపారు. జూన్ 4, 2013న, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టు చేసిన శ్రీశాంత్, చండిలా, చవాన్ తోపాటు మరో 23 మందిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ నిబంధనలతో అభియోగాలు మోపబోతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన శ్రీశాంత్, అంకీత్ చవాన్,  మరో 17 మంది మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అభియోగాలు మోపడానికి ఆధారాలు లేనందున జూన్ 10, 2013న ఢిల్లీ కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ కేసుని విచారించిన పాటియాలా కోర్టు శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకీత్ చవాన్‌లు దోషులు కారని జూలై 2015లో వీరిపై ఉన్న అన్ని ఆరోపణలను తొలగించారు. జనవరి 2016లో, చండిలాను అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవిత నిషేధాన్ని 2019 మార్చిలో సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలోని భారత అదనపు సొలిసిటర్ జనరల్ ఎల్ నాగేశ్వర రావు, సీనియర్ న్యాయవాది, మాజీ క్రికెట్ అంపైర్ నీలే దత్తా, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని అక్టోబర్ 2013లో సుప్రీంకోర్టు నియమించింది. కమిటీ తన నివేదికను ఫిబ్రవరి 2014లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. నివేదిక వివరాలను బహిరంగపరచబడలేదు.

 

గురునాథ్ మీయప్పన్ కేసు

2013 ఐపీఎల్ సీజన్ బెట్టింగ్ కుంభకోణంలో అరెస్టయిన  విందు దారా సింగ్ తరచూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపాల్, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్‌తో సంప్రదిస్తున్నట్లు ఆయన కాల్ రికార్డులో తేలింది. మీయాప్పన్‌కు తరచూ బెట్టింగ్ కోసం కాల్స్ వచ్చాయనే దానిపై దర్యాప్తు చేయడానికి, ముంబై పోలీసులు సమన్లు ​​జారీ చేశారు. 24 మే 2013న, గురునాథ్ మీయప్పన్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నించిన తరువాత బెట్టింగ్ ఆరోపణలపై అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చేసిన తరువాత, చెన్నై జట్టు ఫ్రాంచైజ్ వెంటనే అతన్ని నిరాకరించింది. 24 మే 2013న ఒక పత్రికా ప్రకటనలో, చెన్నై జట్టు ఫ్రాంచైజీని కలిగి ఉన్న ఇండియా సిమెంట్స్ ఇలా పేర్కొంది. ‘మీయాప్పన్ యజమాని కాదు, చెన్నై సూపర్ కింగ్స్ యొక్క సీఈఓ, టీం ప్రిన్సిపాల్ మాత్రమే. అతడు సభ్యులలో ఒకరు మాత్రమే.’ అని తెలిపింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో మీయాప్పన్ పాత్రపై ముగ్గురు సభ్యుల కమిషన్‌తో దర్యాప్తు చూపిస్తామని మే 26న బీసీసీఐ ప్రకటించింది. మీయాప్పన్‌కు 3 జూన్ 2013న ముంబై కోర్టు బెయిల్‌ ఇచ్చింది. తన అల్లుడు గురునాథ్‌పై విధించిన బెట్టింగ్ ఆరోపణలపై న్యాయమైన దర్యాప్తు జరిపేందుకు, మార్చి 25, 2014న, సుప్రీంకోర్టు ఎన్.శ్రీనివాసన్‌ను బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సుప్రీం కోర్టు కోరింది. తన అల్లుడు బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్రీనివాసన్ బీసీసీఐ చీఫ్‌గా కొనసాగడం వికారంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

రాజ్ కుంద్రా కేసు

5 జూన్ 2013న, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రాను అక్రమ బెట్టింగ్‌కు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. జూన్ 6, 2013న, తన స్నేహితుడైన బుకీ ద్వారా తన ఐపీఎల్ జట్టుపై పందెం వేసినట్లు అతను ఒప్పుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కారణంగా, అతన్ని 10 జూన్ 2013న ఐపీఎల్ ఐపీఎల్ నుండి సస్పెండ్ చేసింది.

 

ధోని-ఆమ్రపాలి కేసు

టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనిపై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఆమ్రపాలి కుంభకోణ బాధితులు ధోనిపై కూడా కేసు పెట్టారు. ఆమ్రపాలి సంస్థకు ధోని అంబాసిడర్‌గా పనిచేశారని..ఆయనపై నమ్మకంతోనే తాము ప్లాట్లు కొన్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ధోనికి కూడా భాగం ఉందని తెలిపారు. ఆమ్రపాలి గ్రూప్ సకాలంలో ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలం కావడంతో సుమారు 46000 మంది ప్లాట్ కొనుగోలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కంపెనీ డైరెక్టర్లతో పాటు ఆమ్రపాలీ గ్రూపుకు అనుబంధ సంస్థలపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కంపెనీకి చెందిన సీఎండీ అనిల్‌శర్మ, కంపెనీ డైరక్టర్లు శివప్రియ, అజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ధోని కూడా తనకు రావాల్సిన రూ.40కోట్ల బాకీని ఆమ్రపాలీ గ్రూప్ ఎగ్గొట్టిందని సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి గ్రూప్‌కు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అందుకు పారితోషికంగా తనకు రావాల్సిన రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉందని పలు దఫాలుగా అడుగుతూనే ఉన్నా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ధోని కోర్టుకు తెలిపాడు. ఆమ్రపాలి గ్రూప్ నిధులను మళ్లించడంతో ధోనీ భార్య సాక్షి పాత్ర కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి.