కట్టా-మీఠా..2019 టీంఇండియా క్రికెట్ రౌండప్
ఈ ఏడాది క్రికెట్‌లో భారత జట్టుకు తిరుగులేకుండా పోయింది. వరల్డ్ కప్‌లో సెమి ఫైనల్‌లో నిష్క్రమించినప్పటికీ మిగతా వన్డే, టెస్ట్, టీ20 సిరీస్‌లు, ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. డిసెంబర్ 22న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో విజయం సాధించింది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతోంది.
ఐపీఎల్-12
2019లో జరిగిన ముఖ్యమైన క్రికెట్ టోర్నీల్లో ఐపీఎల్ 12వ సీజన్ ఒకటి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ టోర్నీలో విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాదించింది. దీంతో నాలుగో సారి ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా ముంబయి ఇండియన్స్ రికార్డు సృష్టించింది. 150 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టడి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్ గా నిలవగా.. ఢిల్లీ, హైదరాబాద్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కలకత్తా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రు రస్సెల్ నిలిచాడు. ఈ టోర్నీలో రస్సెల్ 510 పరుగులు చేసి 11 వికెట్లు తీసాడు. ఈ టోర్నీలో 692 పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ 26 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
వరల్డ్ కప్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 2019 క్రికెట్ వరల్డ్ కప్ ఇంగ్లండ్‌లో జరిగింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. సుదీర్ఘ ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు వరల్డ్‌కప్ గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లాండ్ అనూహ్య విజయం సాదించింది. న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్లో ఓడిపోయింది. 2015 ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియా చేతిలో కివీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించడం అనివార్యమైనది. సూపర్ ఓవర్ కూడా టై కావడం గమనార్హం. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కూడా వికెట్ నష్టానికి సరిగ్గా 15 పరుగులే చేసింది. దీంతో.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టుని విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్‌తో కలిపి ఇంగ్లాండ్ జట్టు మొత్తం 26 (ఫోర్లు, సిక్స్‌లు) బౌండరీలు కొట్టగా.. న్యూజిలాండ్ జట్టు 17 మాత్రమే సాధించగలిగింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుని విజయం వరించింది. ప్రపంచకప్‌లో నాలుగోసారి ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్ టీమ్ ఎట్టకేలకు తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కి వరల్డ్‌కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే బౌండరీల ఆధారంగా విశ్వ విజేతను నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియంసన్ నిలిచాడు. రోహిత్ శర్మ 648 పరుగులతో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ (27) ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో టీంఇండియా సెమీఫైనల్‌లోనే నిష్క్రమించింది.
2019 టీమిండియా క్రికెట్ విశేషాలు..
* 2019లో భారత క్రికెట్ జట్టు మొత్తం 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ డ్రా అయింది.
* ఈ ఏడాది మొత్తం 28 వన్డే మ్యాచ్‌లు ఆడగా 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 8 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
* ఇక పొట్టి ఫార్మాట్ విషయానికి వస్తే.. ఈ క్యాలండర్ ఇయర్‌లో టీంఇండియా జట్టు 16 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 7 మ్యాచ్‌ల్లో పరాజయపాలైంది.
* ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ చూస్తే.. టెస్ట్‌ల్లో టీంఇండియా మొదటి ర్యాంక్‌లో కొనసాగుతోంది. వన్డేల్లో రెండవ, టీ20 ఫార్మాట్‌లో ఐదవ ర్యాంక్‌లో ఉంది.
* భారత క్రికెట్ జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ ఈ ఏడాది బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
* ఈ ఏడాది భారత జట్టు హెడ్ కోచ్ ఎంపిక జరుగగా మళ్ళీ రవి శాస్త్రినే నియమించారు.
* క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా జట్టు డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ నవంబర్ 22-24 మధ్య కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌లో జరిగింది. ఇందులో భారత్ విజయం సాధించింది.
* ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి 2,455 పరుగులు చేసిన కోహ్లీ.. వరుసగా నాలుగేళ్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2016లో 2,595 పరుగులు, 2017లో 2,818 పరుగులు, 2018లో 2,735 పరుగులు చేశాడ.