క్రికెటర్ శ్రీశాంత్‌కు మంచి రోజులు.. ఆ గండం నుంచి విముక్తి - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెటర్ శ్రీశాంత్‌కు మంచి రోజులు.. ఆ గండం నుంచి విముక్తి

September 14, 2020

Cricketer Sreesanth Suspension End

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు మంచి రోజులు వచ్చేశాయి. అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇంతకాలం ఆటకు దూరంగా ఉంటూ వచ్చిన అతనికి మళ్ళీ బంతి పట్టుకునే ఛాన్స్ వచ్చింది. నిషేధం ఆదివారం నాటికి ముగిసిపోయింది. దీంతో శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశారు. ఇకనుంచి కేరళ తరుపున దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు

2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయన ఇరుక్కున్నాడు. దీనిపై విచారణ జరిపి ముందుగా జీవిత కాలం నిషేధించారు. దీనిపై ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది ఆగస్టులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీసీసీఐ జీవితకాల నిషేధం ఏడేళ్లకు కుదించింది. అది నిన్నటితో ముగియడంతో శ్రీశాంత్‌కు పూర్తి విముక్తి కలిగింది.  క్రికెట్‌పై ఆసక్తి తో మళ్ళీ బంతి పట్టాలని సిద్ధమయ్యాడు. దీనికోసం తాను ఎంతో ఎదురు చూశానని చెప్పుకొచ్చారు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు మే నెల నుంచే  ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు. 

కాగా, ఇండియా తరపున 27 టెస్టులు, 53 వన్డేలు,10 టీ 20 లు ఆడాడు. చివరిసారిగా 2011 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొన్నాడు. 2007 లో టీ 20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడానికి శ్రీశాంత్  కీలకపాత్ర పోషించాడు. కానీ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ నాశనం చేసుకున్నాడు. 37 ఏళ్ల వయసులో తిరిగి ఆడేందుకు సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న తరుణంలో నిషేధకాలాన్ని పూర్తి చేసుకోవడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు అతనికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తుందో లేదో చూడాలి.