హైకోర్టు తీర్పు ఆనందాన్నిచ్చింది.. క్రికెటర్ శ్రీశాంత్ - MicTv.in - Telugu News
mictv telugu

హైకోర్టు తీర్పు ఆనందాన్నిచ్చింది.. క్రికెటర్ శ్రీశాంత్

August 7, 2017

మీద పడ్డ మరకను కడుక్కోవడం అంత సులువు కాదన్న సంగతి శ్రీశాంత్ విషయంలో తెలిసిపోతుంది. చివరికి పోరాడి గెలిచినట్టే వుంది తన వ్యవహారం.
క్రికెట‌ర్ శ్రీశాంత్‌కు ఊర‌ట క‌లిగించే తీర్పు వెలువ‌రించింది కేర‌ళ హైకోర్టు. అత‌నిపై బీసీసీఐ విధించిన జీవిత‌కాల నిషేధాన్ని ఎత్తేసింది. గ‌తేడాది ఢిల్లీలోని ఓ కోర్టు కూడా స్పాట్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పు త‌ర్వాత త‌నపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల‌ని శ్రీశాంత్ బీసీసీఐని కోరినా బోర్డు తిర‌స్క‌రించింది. దీంతో అత‌ను కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించాడు. కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినా బోర్డు త‌న‌ను కావాల‌ని వేధిస్తున్న‌ద‌ని పిటిష‌న్ వేశాడు. అత‌ను నిర్దోషిగా తేలినా బోర్డు ఎలా నిషేధిస్తుంది? స‌హ‌జ న్యాయాన్ని తిర‌స్క‌రించ‌డమే అవుతుంద‌ని తీర్పు సంద‌ర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.

2013లో శ్రీశాంత్‌తోపాటు ఇద్ద‌రు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చ‌వాన్‌ల‌ను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. హైకోర్టు తీర్పు త‌ర్వాత శ్రీశాంత్ ట్విట్ట‌ర్‌లో ఆనందం వ్య‌క్తం చేశాడు.ఈ తీర్పుపై బోర్డు ఉపాధ్య‌క్షుడు టీసీ మాథ్యూ స్పందిస్తూ.. బీసీసీఐ ఉన్న‌త న్యాయ‌స్థానంలో తీర్పును స‌వాలు చేయ‌కూడ‌ద‌ని తాను వ్య‌క్తిగ‌తంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. నిషేధంపై విచార‌ణ సంద‌ర్భంగా.. గ‌తంలో ఉన్న పాల‌క మండ‌లి నిషేధం విధించిందని, ఇప్ప‌టి పాల‌క మండ‌లికి దానిని ఎత్తేయ‌లేద‌ని బీసీసీఐ వాదించింది. అంతేకాదు స్కాటిష్ లీగ్‌లో ఆడ‌టానికి శ్రీశాంత్‌కు నో ఆబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి కూడా బోర్డు నిరాక‌రించింది. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే హీరోగా సినిమాల్లో బిజీ అవుతున్న శ్రీశాంత్ కు ఇది ఎంతో ఊరట కల్గించే విషయమే.