హైదరాబాద్‌లోని ఫిలింనగర్ స్థల వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కుమారుడు రానాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంపై జరుగుతున్న వివాదంలో బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌కుమార్ కోర్టు ఆశ్రయించగా న్యాయస్థానం వ్యక్తిగతంగా హాజరుకావాలని జనవరి 19న సమన్లు జారీచేసింది. తిరిగి కేసు విచారణను మే1కి వాయిదా వేసింది. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
షేక్ పేట్ మండలం సర్వేనంబర్ 403లోని ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు 1007 గజాలు, పక్కనే హీరో వెంకటేష్‌కు సుమారు వెయ్యి గజాల స్థలం ఉంది. ఈ రెండు స్థలాలను సురేష్ బాబు కుటుంబ సభ్యులు 2014లో హోటల్ ఏర్పాటుకు వ్యాపారి ప్రమోద్‌కుమార్ పచ్వాకు లీజ్‌కు ఇచ్చారు. అయితే సురేష్ బాబుకి చెందిన 1007 గజాల స్థలాన్ని అమ్మేస్తామని చెప్పడంతో రూ.18కోట్లకు డీల్ కుదిరి, రూ.5 కోట్లు చెల్లించినట్లు వ్యాపారి ఆరోపిస్తున్నాడు .
కాగా అంతకుముందే లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదంటూ ప్రమోద్‌పై సురేష్ బాబు ఓ కేసు వేయడంతో పాటు ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు. అయితే తన వద్ద రూ.5కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రమోద్ కోర్టుకెక్కారు. ఇప్పటికే ఈ వివాదంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇవి కొలిక్కిరాకముందే ఏడాది క్రితం ఆ స్థలాన్ని సురేష్‌బాబు.. రానాకు విక్రయించారు.
నవంబరు 1న ఆయనకు చెందిన ఆరుగురు వచ్చి స్థలంలోని సెక్యూరిటీ సిబ్బందిని తరిమివేసారని ప్రమోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి స్పందన లేకపోవడంతో నాంపల్లిలోని 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ను ఆశ్రయించగా..కోర్టు ఆదేశాలతో రానా, సురేష్ బాబుతో పాటు మరికొంతమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రానా, సురేష్‌బాబుకు సమన్లు పంపించింది.