Criminals are a challenge to the police.. If you are aware, catch them
mictv telugu

పోలీసులకు నేరగాళ్ల సవాల్..చేతనైతే పట్టుకోండి

August 17, 2022

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్ క్రైం నేరగాళ్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అదుపుచేయడానికి సైబారాబాద్ క్రైం పోలీసులు పలు రకాల చర్యలు తీసుకున్నప్పటికీ..నేరాలు మాత్రం ఆగటం లేదు. ఏదో రకంగా కొంత పంథాను ఉపయోగించి, నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. గడిచిన 7 నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,300 కేసులు నమోదైతే, అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 5,000 కేసులు నమోదు అవ్వటం పోలీసులకు సవాల్‌గా మారింది.

ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఎక్కడి నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నారు అనే జాడను గుర్తించి పోలీసులు తాజాగా బిహార్ రాష్ట్రం నవాడా జిల్లాకు వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన నేరగాళ్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులపై తుపాకులతో కాల్పులు జరపటం కలకలం రేపింది. ఈ కాల్పుల్లో పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. కానీ, ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్ తప్పించుకున్నాడు. దీంతో నేరగాళ్లు రెచ్చిపోయి, దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

అయితే, ఈ నేరగాళ్లు ఎందుకు ఈ పనినే తమ వృత్తిగా ఎంచుకున్నారు? వీరికి ఎవరు సాయం చేస్తున్నారు? అనే వివరాలపై పోలీసులు ఆరా తీశారు. ”బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, నేపాల్ తదితర ప్రాంతాలకు చెందిన.. పది, ఇంటర్ ఫెయిల్ అయిన కొంతమంది యువకులు..ఓ నేర సామ్రాజ్యాన్ని స్థాపించారు. రూ. వేల సంపాదన నుంచి రూ. కోట్ల రూపాయలను కాజేయటం మొదలుపెట్టారు. వీరికి స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులకు రూ.లక్షల్లో కమీషన్ ముట్టజెబుతున్నారు. అరెస్టయితే, క్షణాల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు వ్యక్తిగత న్యాయవాదులను నియమించుకుంటున్నారు. ఇంత పకడ్బందీగా నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకొనేందుకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు అరకొర జాగ్రత్తలు తీసుకోవటం వల్లే ఈ నేరాలు జరుగుతున్నాయి” అని పలు సంచలన విషయాలు వెల్లడైయ్యాయి.

తాజాగా పలువురు పోలీసులు ఈ నేరాలకు సంబందించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ”ప్రజల సొమ్మును భారీగా కాజేస్తున్నారంటూ చెబుతున్నా, తమ మాటలను పట్టించుకోవటం లేదు. ఇటీవలే కర్ణాటకలో గొలుసు దొంగలను పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ యాదయ్య కత్తిపోట్లకు గురయ్యారు. మాదాపూర్ జోన్ పరిధిలోని ఓ ఠాణాలోకి వచ్చిన స్థిరాస్తి వ్యాపారి ఇన్‌స్పెక్టర్‌పై దాడికి దిగారు. రెండు నెలల క్రితం బండ్లగూడ జాగీర్ వద్ద మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను పట్టుకునేందుకు వెళ్లిన ఎస్‌వోటీ పోలీసులపై దాడి జరిగింది. కళ్లెదుట పోలీసులపై ఇన్ని దాడులు జరుగుతున్నా నేర పరిశోధన, అంతరాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులను నిరాయుధులుగా పంపుతున్నారు” అని ఆవేదన చెందారు.

విచిత్రం ఏంటంటే..ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్‌ సాయంతో రూ. లక్షల్లో సంపాదిస్తున్నా నేరగాళ్లకు తమ ఆడపిల్లలను ఇచ్చి, పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు సిద్దపడుతున్నారట. ఎందుకంటే.. సంపదన బాగుంది, పోలీసుల చేతికి చిక్కినా, క్షణాల్లో బయటి వస్తున్నారు. ఒకవేళ కేసు నమోదైన, ఆయా రాష్ట్రాల న్యాయస్థానాలు నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చినా, నగరంలోని కొన్ని న్యాయస్థానాలు సైబర్ నేరస్థులకు వెంటనే బెయిలిస్తుండడంతో తమ బిడ్డలకు ఏలాంటి హాని ఉండదంటూ, తల్లిదండ్రులు భరోసాగా ఉంటున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు.

అయితే, ఈ నేరాలను ఎలాగైనా అదుపు చేయాలని తెలంగాణ పోలీసులు వేగం పెంచారు. బాధితుల నుంచి లక్షలకు లక్షలను కొట్టిసిన సైబర్ నేరగాళ్లను పట్టుకోవటం కోసం పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఇంతకీ ఆ సైబర్ నేరగాళ్లు పట్టుబడతారా? మళ్లీ కాల్పులకు తెగబడతారా? అనే పలు అనుమానాలు ప్రజల్లో రెకెత్తుతున్నాయి.