సైబర్ నేరస్తులు కొత్త ఎత్తుగడలతో జనాలకు వల విసురుతున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువవుతున్న కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో సామాన్యులే కాకుండా ఉన్నతాధికారులు, సంపన్నులు, విద్యావేత్తలు కూడా బలి అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణలో జరిగింది. డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టిన వ్యక్తులు.. ఆయన పేరుతో పలువురి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. 9785743029 నెంబరు వాట్సాప్కు మహేందర్ రెడ్డి పేరు, ఫోటో పెట్టి దాని ద్వారా పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులకు మెసేజులు పెట్టారు. సామాన్య ప్రజలకు కూడా అలానే చేశారు. డీజీపీ పేరుతో డబ్బు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన సైబర్ క్రైం విభాగం దర్యాప్తు ప్రారంభించింది. అటు డీజీపీ కూడా సీరియస్ అయి మెసెజులపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అటు ఇలాంటి ఫేక్ మెసేజులకు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.