Criminals who have changed the route..messages saying that they will stop the supply
mictv telugu

వామ్మో: నేరగాళ్ల కొత్త పంథా..అధికారులకే మెసేజ్‌లు

August 24, 2022

దేశవ్యాప్తంగా గతకొన్ని నెలలుగా ఆయా రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లపై బాధితులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. దాంతో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి నేరగాళ్లు కొత్త కొత్త ఆలోచనలతో నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇన్నాళ్లు బ్యాంకులపై, ఏటీఏంలపై, ఆన్‌లైన్ లాభాదేవీలపై ఫోకస్ చేసిన నేరగాళ్లు..ఇప్పుడు రూటు మార్చారు. విద్యుత్ వినియోగదారులపై ఫోకస్ పెట్టారు.

గత నెలలో కరెంట్ బిల్లు చెల్లించనందుకు ఈరోజు రాత్రి 9.30 గంటలకు మీ ఇంట్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తామంటూ మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపించేస్తున్నారు. దీంతో బాధితులు విద్యుత్ అధికారులకు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. తాజాగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు కూడా ఇలాంటి మెసేజులు రావడంతో ఆయన విస్తుపోయారు. నేరగాళ్లు ఎంచుకున్న విధానాన్ని చూసి షాక్ అయ్యారు.

ఈ క్రమంలో తనకొచ్చిన మెసేజ్‌లపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విస్ట్ ఎంటంటే..ఆయనకులాగే అలాంటి మెసేజ్‌లు కొన్ని వందలమందికి రావడంతో పోలీసులు స్టేషన్‌లో వందల మంది బాధితులు ఫిర్యాదులు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో కొంతమంది వచ్చిన మెసేజ్‌లు చదివి, అది నిజమే అని నమ్మి సైబర్ నేరగాళ్లకు ఫోన్లకు డబ్బులు పంపించినవారు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ నేరగాళ్ల పట్ల, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.