ఫిఫా వరల్డ్ కప్‌లో అంచనాలు అందుకోకపోయినా క్రిస్టియానో రొనాల్డో బ్రాండ్ వ్యాలు చెక్కుచెదరలేదు. మరోసారి రొనాల్డో యొక్క స్టార్డమ్ రుజువైంది. ఏకంగా ఒక్క ఒక్క డీల్‌తో 4,400 కోట్ల రూపాయలు సంపాదించనున్నాడు. ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ చేత తొలగించబడిన రొనాల్డో..తాజాగా భారీ డీల్‌తో మరో క్లబ్‌తో బంధాన్ని ఏర్పారచుకున్నాడు. ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్-రొనాల్డో మధ్య ఒప్పందం కుదరింది. ఈ ఒప్పందం ప్రకారం రొనాల్డో ఏడాదికి 200 మిలియన్ యూరోలు(1700 కోట్లు) అందుకోనున్నాడు. 2025 జూన్ వరకు ఈ డీల్ కుదిరింది. అంటే మొత్తం భారత్ కరెన్సీలో రూ.4400 కోట్లను రొనాల్డోకు సౌదీ క్లబ్ చెల్లించనుంది. దీంతో ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు.
అల్ నాసర్ తో కలిసి ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని డీల్ అనంతరం రొనాల్డో తెలిపాడు.”మరో దేశంలో కొత్త ఫుట్‌బాల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికే అనేక లీగ్‌లు, టోర్నీలను గెలిచా. ఆసియా ఆటగాళ్లతోనూ నా అనుభవాన్ని పంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా” అని రొనాల్డో వ్యాఖ్యానించాడు. రొనాల్డ్తో డీల్ తమ దేశ భవిష్యత్తు తరాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని అల్-నాసర్ క్లబ్ తెలిపింది. అల్ నాసర్ – రొనాల్డో డీల్ తర్వాత కొన్ని గంటలకే క్లబ్ యొక్క ఇన్‌స్టా ఫాలోయింగ్ మూడు రెట్లు పెరిగింది. 860K ఫాలోవర్స్ 2.9 మిలియన్లకు పెరిగిపోయారు. ఇందుకోసం ప్రధాన కారణం రొనాల్డో క్లబ్ యొక్క ఇన్ స్టా ఖాతాను ఫాలో అవ్వడమే.